Parasakthi OTT Release: ఓటీటీలోకి శివకార్తికేయన్ ' పరాశక్తి'.. తెలుగులో నేరుగా ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Parasakthi OTT Release: ఓటీటీలోకి శివకార్తికేయన్ ' పరాశక్తి'.. తెలుగులో నేరుగా ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. తన విలక్షణమైన నటనతో తమిళంలోనే కాదు తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఇటీవల సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఆయన చిత్రం 'పరాశక్తి' బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే టాలీవుడ్ లో సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలు బరిలో ఉండటంతో థియేటర్ల కొరత ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాలేదు. అయితే తెలుగు ప్రేక్షకులను నిరాశపరచకుండా మేకర్స్ ఇప్పుడు ఈ మూవీని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. 

ఓటీటీలో ఎప్పుడు? ఎక్కడ?

సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కథాంశం పరంగా కొన్ని వివాదాలు తలెత్తినప్పటికీ, కంటెంట్‌లోని బలం కారణంగా కేవలం కొద్ది రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. శివకార్తికేయన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. ఈ పరాశక్తి మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ( ZEE5 ) భారీ ధరకు సొంతం చేసుకుంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం..  ఫిబ్రవరి 7న ఈ చిత్రం తమిళ్‌తో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన తెలుగు ఫ్యాన్స్‌కు ఇది నిజంగా తీపి కబురే!

కథా నేపథ్యం..

ఈ సినిమా కేవలం కమర్షియల్ ఎంటర్టైనర్ మాత్రమే కాదు, ఒక చారిత్రక నేపథ్యం ఉన్న కథ. 1965లో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టిన ఉద్యమం ఆ కాలంలో సంచలనం సృష్టించింది. ఈ అల్లర్ల నేపథ్యంలో ఇద్దరు సోదరులు చెజియాన్, చిన్నదురై జీవితాలు ఎలా తలకిందులయ్యాయి? వారి కుటుంబం ఈ రాజకీయ పోరాటంలో ఎలాంటి మూల్యం చెల్లించుకుంది? అనే అంశాలను సుధా కొంగర ఎంతో ఉద్వేగభరితంగా ఆవిష్కరించారు.

టాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల ఈ చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె గ్లామర్, డ్యాన్స్‌తో పాటు నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. బాలీవుడ్ నటి సంధ్య మృదుల్ భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ కాలం నాటి రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.  

ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాల్లో రానా దగ్గుబాటి, మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ మెరవడం సినిమాకు పాన్-ఇండియా అప్పీల్‌ను తీసుకొచ్చింది. ఇది పీరియడ్ డ్రామా కావడంతో 1960ల నాటి వాతావరణాన్ని సెట్స్, కాస్ట్యూమ్స్ ద్వారా అద్భుతంగా రీ-క్రియేట్ చేశారు. థియేటర్లలో రికార్లు సృష్టించిన శివకార్తికేయన్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్, సుధా కొంగర మార్క్ టేకింగ్ కలగలిసిన ‘పరాశక్తి’ ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.