బీజేపీ అధ్యక్షులు తెలంగాణకు గాడిద గుడ్డే తీసుకొచ్చారు: సీఎం రేవంత్

బీజేపీ అధ్యక్షులు తెలంగాణకు గాడిద గుడ్డే తీసుకొచ్చారు: సీఎం రేవంత్

బీజేపీ అధ్యక్షులు తెలంగాణకు గాడిద గుడ్డే తీసుకొచ్చారు తప్ప ఏం తేలేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం (ఫిబ్రవరి 05) కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సీఎం.. రుక్మాపూర్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కళాశాల ప్రారంభించారు. కరీంనగర్ జిల్లాలో ఏటీసీ సెంటర్ కు శంకుస్థాపన చేసిన చేశారు. ఈ సందర్భంగా చొప్పదండి సెగ్మెంట్ గుమ్లాపూర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్, బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. 

కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం..  మెట్రో, మూసీ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఇవ్వట్లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టు జాతీయ హోదాపై ప్రధాని మోదీ హామీ ఏమైందని ప్రశ్నించారు. 2014లో ఇచ్చిన హామీ ఇంకెప్పుడు నెరవేరుస్తారో చెప్పాలన్నారు. బీజేపీ అధ్యక్షులు తెలంగాణకు గాడిద గుడ్డే తీసుకొచ్చారు.. ఏం తేలేదని విమర్శించారు. బీజేపీ నేతలు ఎంత మంది వచ్చినా ఒక్క మున్సిపాలిటీ గెలవలేరన్నారు. BRS, BJP బంధం వీణా–వాణి లాంటిదని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు ట్రాన్స్ ఫర్ చేశారని ఆరోపించారు. 

కరీంనగర్ నుంచి తెలంగాణ మలిదశ ఉద్యమం ప్రారంభమైందన్నారు సీఎం రేవంత్. కరీంనగర్ సభలోనే సోనియా గాంధీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వాగ్ధానం చేశారని గుర్తు చేశారు. ఆంధ్రలో పార్టీ నష్టపోయినా తెలంగాణ ఇచ్చారని కొనియాడారు. 60 ఏళ్ల స్వరాష్ట్ర కలలను సోనియా సాకారం చేశారని చెప్పారు. 

కాంగ్రెస్ హయాంలోనే రైతులకు ఉచిత కరెంట్ వచ్చిందనీ.. ఉచిత కరెంట్ పథకం పేటెంట్ కాంగ్రెస్ దేనన్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తే.. బీఆర్ఎస్ నేతలు కుటుంబ ఆస్తులు పెంచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలన చూసి బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. ప్రజలకు మంచి చేయడం చూసి ఓర్వలేక దిగిపోవాలని అంటున్నారన్నారు. బీఆరెఎస్ హయాంలో చొప్పదండిలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు.