BRS నుంచి BJP నేతలు మామూళ్లు తీసుకుంటున్నారు: సీఎం రేవంత్

BRS నుంచి BJP నేతలు మామూళ్లు తీసుకుంటున్నారు: సీఎం రేవంత్

బీఆర్ఎస్ నుంచి బీజేపీ నేతలు మామూళ్లు తీసుకుంటున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, బీజేపీలది వీణా–వాణి బంధమన్నారు. అందుకే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ ఓట్ ట్రాన్స్  ఫర్ చేసిందని ఆరోపించారు. అవినీతి, దోపిడీ నుంచి రక్షణ కోసమే ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సహకారం చేసిందన్నారు. 

కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా చొప్పదండిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన సీఎం.. కాళేశ్వరం సీబీఐ విచారణ ఎందుకు చేయట్లేదో బండి సంజయ్, కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరితే ఆర్నెళ్లైనా కేసు పెట్టలేదని.. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే హరీశ్, కేటీఆర్, కేసీఆర్ లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందన్నారు. 

ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్లు రాని బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. పదేళ్లలో కేసీర్ ప్రజలకు లెక్క చెప్పాలని సవాల్ చేశారు. రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని.. 
డౌట్ ఉంటే ఎల్బీస్టేడియానికి బీఆర్ఎస్ నేతలు రావాలని సవాల్ విసిరారు. 20 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్ ప్రారంభించామని చెప్పారు. 

►ALSO READ | బీజేపీ అధ్యక్షులు తెలంగాణకు గాడిద గుడ్డే తీసుకొచ్చారు: సీఎం రేవంత్

21 లక్షల మంది రైదులకు 2 లక్షల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు సీఎం రేవంత్. ప్రతి గింజకూ గిట్టుబాటు ధర ఇస్తున్నామన్నారు. మిల్లర్ల నుంచి వాటాల పేరుతో బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని విమర్శించారు. తాము  వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తున్నామన్నారు. ఇందిరమ్మ చీరల్లో మహిళలను చూస్తుంటే దసరా నాడు పాలపిట్టను చూసినట్లుందని సంతోషం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆడబిడ్డల చీరల్లోనూ అవినీతి చేశారని విమర్శించారు. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తా.. లేదంటే రానట్లు కేసీఆర్ తీరు ఉందని.. అసెంబ్లీకి రాని కేసీఆర్ జీతాన్ని కట్ చేయాలా వద్దా..? అని ప్రశ్నించారు.