పనిచేస్తున్న ఆఫీసు బిల్డింగ్పై నుంచి దూకి చనిపోయింది.. కూకట్ పల్లిలో విషాద ఘటన

పనిచేస్తున్న ఆఫీసు బిల్డింగ్పై నుంచి దూకి చనిపోయింది.. కూకట్ పల్లిలో విషాద ఘటన

కూకట్ పల్లి: KPHB పోలీస్ స్టేషన్ పరిధిలోని సీబీసీఐడీ కాలనీలో విషాదం జరిగింది. పనిచేస్తున్న ఆఫీసు భవనంపై నుంచి దూకి అనిత (23) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. అనారోగ్య సమస్యతో బాధపడుతూ అనిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. అనిత తల్లి రాధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాచుపల్లికి చెందిన శ్రీనివాసులుతో 2021లో అనితకు వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో దంపతులు నివాసం ఉంటున్నారు. ఫిబ్రవరి నాలుగో తేదీన సిబిసిఐడి కాలనీలో తను పనిచేస్తున్న ఆఫీసు భవనం పై నుంచి దూకి అనిత ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా విషాదం నెలకొంది.

వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఓ ఐటీ ఉద్యోగి, ఒంటరితనంతో దివ్యాంగుడు, ఆర్థిక ఇబ్బందులతో మరో యువకుడు హైదరాబాద్ సిటీలో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని అమలాపురం తిలకుప్పకు చెందిన సతీశ్ (31) గచ్చిబౌలిలో ఉంటూ ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు. సతీశ్ భార్య ఇటీవల సొంతూరికి వెళ్లగా, బుధవారం ఉరేసుకుని చనిపోయాడు. జాబ్లో ప్రెషర్ అవుతుందని సతీశ్ చెబుతుండేవాడని బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏపీలోని రాజమండ్రికి చెందిన పి. శ్రీనివాస్ (40) కూకట్​పల్లిలోని ప్రశాంత్​నగర్లో నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. దివ్యాంగుడైన ఆయన బుధవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. లెటర్లో ‘జీవితంపై విరక్తి కలిగింది, తల్లిని బాధపెడుతున్నాను, అందుకే చనిపోతున్నాను, నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని రాశాడు.

కడప జిల్లా బద్వేల్​కు చెందిన ఎం. వెంకటేష్ (30) ఎంబీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్​లో ఉద్యోగం చేసేందుకు సొంతూరు నుంచి బయలుదేరి ఈ నెల 3న మియాపూర్ చేరుకున్నాడు. అదే రోజు ఉదయం మియాపూర్ బొమ్మరిల్లు దగ్గర గడ్డి మందు తాగి 108కు కాల్ చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులతోనే వెంకటేశ్ చనిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.