- నేటి నుంచే ప్రారంభం
- కమీషన్ విధానం ఉండదు..
- చార్జీ 30 శాతం వరకు తగ్గే చాన్స్
న్యూఢిల్లీ: మన రోజువారీ ప్రయాణాల్లో ట్యాక్సీ సర్వీసులు భాగమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో రవాణా భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సొంతంగా భారత్ ట్యాక్సీని తీసుకొచ్చింది. కేంద్రహోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా గురువారం దీనిని ప్రారంభించనున్నారు. ఇది సహకార విధానంలో ప్రయాణ సేవలు అందించే ప్లాట్‌ఫారమ్. రెండు నెలల పాటు ఢిల్లీ, గుజరాత్ ప్రాంతాల్లో ప్రయోగాత్మక నిర్వహణ విజయవంతంగా ముగిసిన తర్వాత దీనిని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో నగరాల్లో త్వరలోనే ఈ సేవలు మొదలవుతాయి. ఇందులో డ్రైవర్లు కేవలం పనివారు మాత్రమే కాదు..ఈ సంస్థలో వాటాదారులు. అందుకే వారిని సారథులు అని పిలుస్తారు. అమూల్ తరహాలో ఇది పనిచేస్తుంది. ఈ సంస్థ మల్టీ-స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీల చట్టం 2002 కింద నమోదైంది.
ధరలు చాలా తక్కువ..
సాధారణ టాక్సీలతో పోలిస్తే భారత్ టాక్సీ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ సంస్థలు డ్రైవర్ల ఆదాయం నుంచి 20 నుంచి 30 శాతం వరకు కమీషన్ వసూలు చేస్తాయి. భారత్ టాక్సీలో సున్నా కమీషన్ విధానం ఉంటుంది. దీనివల్ల డ్రైవర్లకు పూర్తి ఆదాయం లభిస్తుంది. వర్షం పడినప్పుడు లేదా రద్దీ సమయాల్లో ప్రైవేట్ యాప్‌లు ధరలను భారీగా పెంచుతాయి, కానీ ఈ విధానంలో చార్జీలు (ఫిక్స్డ్) మారువు. మొదటి నాలుగు కిలోమీటర్ల వరకు కనీస చార్జీ రూ.30 గా నిర్ణయించారు. 4 నుంచి 12 కిలోమీటర్ల వరకు కిలోమీటరుకు రూ.23 చొప్పున, 12 కిలోమీటర్ల పైన కిలోమీటరుకు రూ.18 చొప్పున వసూలు చేస్తారు. ప్రైవేట్ యాప్‌ల కంటే ఇవి సుమారు 20 నుంచి 30 శాతం వరకు తక్కువకే లభిస్తాయి.
పోటీదారులకు ఇబ్బందే
పోటీదారులకు దీనివల్ల భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు 3 లక్షల మంది డ్రైవర్లు ఈ వేదికలో చేరారు. ప్రైవేట్ సంస్థల్లో డ్రైవర్లకు కమీషన్ కోతలు, పెరిగిన ధరల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారత్ టాక్సీలో డ్రైవర్లకు రూ.5 లక్షల వరకు ప్రమాద బీమా, కుటుంబ ఆరోగ్య బీమా వంటివి కూడా ఇస్తున్నారు. ప్రైవేట్ సంస్థల గుత్తాధిపత్యానికి ఇది గట్టి పోటీ ఇస్తుంది. దీనివల్ల ప్రైవేట్ సంస్థలు తమ కమీషన్లను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నారు.
