కొత్త రోడ్లు 25 వేల కిలోమీటర్లు

కొత్త రోడ్లు 25 వేల కిలోమీటర్లు
  • కొత్త రోడ్లు 25 వేల కిలోమీటర్లు
  • రోడ్ ట్రాన్స్ పోర్టు అండ్ హైవే స్ మినిస్ట్రీకి 2 లక్షల కోట్లు 
  • కొండ ప్రాంతాల్లో రోప్ వేలు 
  • నాలుగు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు

న్యూఢిల్లీ: కేంద్రం ఈసారి బడ్జెట్ లో రోడ్లకు ప్రాధాన్యం ఇచ్చింది. పీఎం గతిశక్తిలో భాగంగా ప్రజా రవాణా, గూడ్స్ రవాణాను మరింత సులభతరం చేసేందుకు నేషనల్ హైవేలను విస్తరించాలని నిర్ణయించింది. ఎక్స్ ప్రెస్ వేలకు సంబంధించి పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ ను రూపొందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 2022–23 ఫైనాన్షియల్ ఇయర్ లో 25 వేల కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలను నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకోసం బడ్జెట్ లో రోడ్ ట్రాన్స్ పోర్టు అండ్ హైవే స్ మినిస్ట్రీకి రూ.1,99,107.71 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దీనికి అదనంగా మరో రూ.20 వేల కోట్లను సేకరిస్తామని చెప్పారు. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (పీపీపీ)లో భాగంగా నాలుగు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. కాగా, పోయినేడాది రోడ్డు ట్రాన్స్ పోర్టుకు బడ్జెట్ లో రూ.1,18,101 కోట్లు కేటాయించిన కేంద్రం.. ఈసారి నిధులను 68 శాతం పెంచింది. పోయినేడు నేషనల్ హైవేస్ అథారిటీకి రూ.76,665 కోట్లు కేటాయించగా, ఈసారి 133 శాతం పెంచి... రూ.1,34,015 కోట్లు కేటాయించింది. 

ఈ ఏడాదే 8 రోప్ వేలు.. 
ప్రజా రవాణాకు ఇబ్బందులు ఎదురయ్యే కొండ ప్రాంతాల్లో ట్రాన్స్ పోర్టును మెరుగుపరిచేందుకు రోప్ వేలు నిర్మిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇందుకోసం పీపీపీ పద్ధతిలో నేషనల్ రోప్ వే డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ (పర్వతమాల) ప్రారంభిస్తామని తెలిపారు. 60 కిలోమీటర్ల మేర 8 రోప్ వేలను ఈ ఏడాదిలోనే చేపడతామని పేర్కొన్నారు. ఇది టూరిజం డెవలప్ మెంట్ కు కూడా ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర కేటాయింపులపై రోడ్ ట్రాన్స్ పోర్టు అండ్ హైవే స్ మినిస్టర్ నితిన్ గడ్కరీ హర్షం వ్యక్తం చేశారు. నేషనల్ రోప్ వే డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ తో నార్త్ ఈస్ట్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ కు ప్రయోజనం చేకూరుతుందన్నారు. 

రోడ్‌ నెట్ వర్క్ లో వరల్డ్ లో సెకండ్ ప్లేస్.. 
మన దేశంలో 2019–20లో 10,237 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలను నిర్మించగా.. 2020–21లో 13,327 కిలోమీటర్ల మేర నిర్మించినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. 2019-–20లో రోజుకు 28 కిలోమీటర్ల మేర రోడ్లు వేయగా, అది 2020–-21లో 36.5 కిలోమీటర్ల(30.2%)కు పెరిగింది. ఇక 2021–22లో సెప్టెంబర్ వరకు 3,824 కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలు నిర్మించారు. కాగా, మన దేశంలో 2019 మార్చి 31 వరకు నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు, జిల్లా, రూరల్, అర్బన్ రోడ్లన్నీ కలిపి 63.71 లక్షల కిలోమీటర్ల మేర ఉన్నాయి. రోడ్డు నెట్ వర్క్ లో ప్రపంచవ్యాప్తంగా మనమే రెండో స్థానంలో ఉన్నాం. 66.45 లక్షల కిలోమీటర్ల రోడ్లతో అమెరికా మొదటి స్థానంలో ఉంది.

పల్లెల్లో రోడ్లకు 19 వేల కోట్లు
పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు పెంచింది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్ వై) కింద రూ.19 వేల కోట్లు కేటాయించింది. 2021–22లో రూ.14 వేల కోట్లు కేటాయించగా, ఇప్పుడు 30 శాతం నిధులు పెంచింది. ఈ స్కీమ్ కింద మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్లు వేసేందుకు కేంద్రం కేటాయింపులు ఎక్కువగా చేసింది.