రాష్ట్ర సర్కార్​కు రూ.920 కోట్ల ఫైన్

రాష్ట్ర సర్కార్​కు రూ.920 కోట్ల ఫైన్
  • పాలమూరు, డిండిలో పర్యావరణ 
  • రూల్స్ అతిక్రమించారంటూ ఎన్జీటీ తీర్పు
  • తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఉద్దేశపూర్వకం
  • మూడు నెలల్లో కేఆర్‌‌ఎంబీ వద్ద డిపాజిట్‌‌ చేయాలని ఆదేశం

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి నేషనల్‌‌ గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌(ఎన్జీటీ) షాక్‌‌ ఇచ్చింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌‌ స్కీముల్లో పర్యావరణ ఉల్లంఘనలకు రూ.920 కోట్ల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని మూడు నెలల్లోగా కేఆర్‌‌ఎంబీ వద్ద డిపాజిట్‌‌ చేయాలని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌‌ స్కీములను చేపట్టి రిజర్వ్‌‌ ఫారెస్టులో పనులు చేస్తూ పర్యావరణానికి నష్టం కలిగిస్తోందని ఏపీ ప్రభుత్వం, కడప జిల్లాకు చెందిన చంద్రమౌళీశ్వర రెడ్డి, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్‌‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్ గురువారం ఈ తీర్పు వెల్లడించింది.  

తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండానే ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని, అనుమతుల కోసం కనీసం పబ్లిక్‌‌ హియరింగ్‌‌ సహా ఇతర ప్రక్రియ కూడా నిర్వహించలేదని బెంచ్‌‌ జ్యుడీషియల్‌‌ మెంబర్‌‌ జస్టిస్‌‌ పుష్ప సత్యనారాయణ, ఎక్స్‌‌పర్ట్‌‌ మెంబర్‌‌ సత్యగోపాల్‌‌ తమ తీర్పులో పేర్కొన్నారు. 

‘‘ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపడితే కేఆర్‌‌ఎంబీకి డీపీఆర్ సమర్పించి బోర్డుతో పాటు అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఈ రూల్​ను తెలంగాణ సర్కారు ఉల్లంఘించింది. ఏదైనా ప్రాజెక్టులో ఇరిగేషన్‌‌ కాంపోనెంట్స్‌‌ ఉంటే పర్యావరణ అనుమతులు తప్పనిసరి. కానీ ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు కొనసాగించారు. పనులు ఆపాలని ఎన్‌‌జీటీ ఆదేశించినా ఉద్దేశ పూర్వకంగా ఉల్లంఘించారు’’ అని తేల్చిచెప్పారు.

పర్యావరణ పరిరక్షణకు ఖర్చు

పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టినందుకు వాటి నిర్మాణ వ్యయంలో 1.5 శాతం జరిమానా చెల్లించాలని బెంచ్ ఆదేశించింది. పాలమూరు–రంగారెడ్డి నిర్మాణ ఖర్చు రూ.35,200 కోట్లు కాగా అందులో 1.5% అంటే రూ.528 కోట్లు, డిండి లిఫ్ట్‌‌ స్కీం నిర్మాణ ఖర్చు రూ.6,190 కోట్లలో 1.5 శాతం.. అంటే రూ.92.85 కోట్లు జరిమానాగా చెల్లించాలని పేర్కొంది. ఎన్‌‌జీటీ తీర్పును ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్టు తేలినందున ఇంకో రూ.300 కోట్లు పెనాల్టీ చెల్లించాలంది. మొత్తం రూ.920.85 కోట్లను 3 నెలల్లోగా కేఆర్‌‌ఎంబీ వద్ద జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం చెల్లించే జరిమానాతో కృష్ణా నదితో పాటు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని సూచించింది. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖల్లో జాయింట్‌‌ సెక్రటరీ స్థాయి అధికారులు, సెంట్రల్‌‌ పొల్యూషన్‌‌ కంట్రోల్‌‌ బోర్డు, కేఆర్ఎంబీ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ చేసే సూచనలకు అనుగుణంగా పర్యావరణ పునరుద్ధరణ పనులు చేపట్టాలని పేర్కొంది. ఈ కమిటీకి నోడల్‌‌ ఏజెన్సీగా కేఆర్‌‌ఎంబీ వ్యవహరిస్తుందని తెలిపింది. తీర్పు వెలువడిన నెల రోజుల్లోగా ఈ కమిటీని నియమించాలంది. కృష్ణా నది ప్రవహించే అన్ని రాష్ట్రాలతో పాటు ‘నీరి’ సంస్థకు చెందిన నిపుణుల భాగస్వామ్యంతో నమామి గంగే తరహాలో కృష్ణా నది పునరుద్ధరణ ప్రణాళికలు సిద్ధం చేయాలంది. కమిటీ రూపొందించిన ప్రతిపాదనలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దృష్టికి కేఆర్‌‌ఎంబీ తీసుకెళ్లి ఈమేరకు పనులు చేపట్టాలని తెలిపింది. ఈ కమిటీ ఏడాదిలోగా తమ నివేదికను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సమర్పించాలని ఆదేశించింది.

అన్ని అనుమతులు తీసుకోవాలె

కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నియమించిన కమిటీ రిపోర్టు ప్రకారం పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల పనులు 75 శాతం పూర్తి చేశారని సభ్యులు తీర్పులో తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్‌‌ స్కీములు పర్యావరణ అనుమతులతో పాటు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన మిగతా అనుమతులు తీసుకొని తీరాలని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్​జీటీ ఉత్తర్వులను కావాలనే ఉల్లంఘించిందని కేఆర్‌‌ఎంబీ పరిశీలనలో తేలిందన్నారు. ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న 18 ప్యాకేజీలను బోర్డు నియమించిన కమిటీ పరిశీలించి నివేదించిందన్నారు. తాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టు పనులు చేపడుతున్నామని చెప్తూ వేల కోట్ల ఖర్చు చేసి సాగు నీటిని ఇచ్చే పనులు చేస్తున్నారని తేలిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే క్రమంలో పర్యావరణానికి చేస్తున్న నష్టం, హాని ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ తీర్పును ఉల్లంఘించినందుకు జరిమానా చెల్లించాల్సిందేనన్నారు.