ఎగ్జామ్స్, కరోనా తో భద్రాద్రికి తగ్గిన భక్తులు

ఎగ్జామ్స్, కరోనా తో భద్రాద్రికి తగ్గిన భక్తులు

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానానికి రోజురోజుకు భక్తుల రాక తగ్గుతోంది. శ్రీరామనవమి వేళ ఇలాంటి పరిస్థితిని చూసి దేవస్థానం అధికారులు తలలు పట్టుకుంటున్నారు. సాధారణ రోజుల్లో రోజూ 5 వేల మంది, శని, ఆదివారాల్లో 15 వేల మంది చొప్పున భక్తులు వస్తుంటారు. కానీ ఇప్పుడు రోజూ వెయ్యి మంది కంటే ఎక్కువ భక్తులు రాని పరిస్థితి. ఇది ఇలాగే ఉంటే శ్రీరామనవమికి కూడా భక్తులు వచ్చేది అనుమానమేనని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. గతేడాది సెప్టెంబరు 25న పాపికొండల్లో కచ్చలూరు వద్ద పర్యాటక లాంచీ బోల్తా పడింది. 47 మంది పర్యాటకులు జలసమాధి అయ్యారు. దీంతో ఆంధ్రప్రదేశ్‍ ప్రభుత్వం పాపికొండల పర్యాటకాన్ని రద్దు చేసింది. అప్పటి నుంచి పర్యాటకుల రాక నిలిచిపోయింది. ఈ ప్రభావం భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంపైనా పడింది. నాటి నుంచి నేటి వరకు భక్తుల సంఖ్య రోజు రోజుకూ తగ్గుతూ వస్తోంది. అనేక ఒడిదుడుకుల నడుమ ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈసారి శ్రీరామనవమికైనా భక్తులను రప్పించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా కలెక్టర్‍ఎం.వి.రెడ్డి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. అయితే ఓ వైపు పిల్లల పరీక్షలతో పాటు మరోవైపు ‘కరోనా’ ఎఫెక్ట్ తో భక్తులు ఆలయ దర్శనానికి రావడం లేదు. తాజాగా దేశంలో కరోనా బాధితుల సంఖ్య 50 దాటింది. ఈ నేపథ్యంలో ఆలయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎండోమెంట్‍ కమిషనర్‍ అనిల్‍కుమార్ ఆదేశాలు జారీ చేశారు. హోలీ వంటి పండుగలు కూడా చేసుకోవద్దని స్వయంగా ప్రభుత్వాలే ప్రకటనలు జారీ చేస్తుండటంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. అటు పాలకుల ప్రకటనలు గందరగోళం సృష్టిస్తుంటే మరోవైపు శ్రీరామనవమికి భక్తులను రప్పించేందుకు ఏం చేయాలి..  అనే తర్జనభర్జనలు జిల్లా అధికారుల్లో జరుగుతున్నాయి.

చితికిపోయిన చిరువ్యాపారులు

సీతారామచంద్రస్వామి దేవస్థానంపై ఆధారపడి జీవించే పలువురు చిరువ్యాపారులు చితికిపోయారు. వరుస దెబ్బలు వారిని కోలుకోనీయడం లేదు. అప్పుల పాలై కనీసం అద్దెలు కూడా చెల్లించలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఆలయం చుట్టూ వందకు పైగా చిరుదుకాణాలు ఉన్నాయి. బొమ్మలు, దేవుడి ఫొటోల దుకాణాలు, హోటళ్లు తదితర వ్యాపారులు గిరిగిరి వడ్డీలు తెచ్చి వ్యాపారాలు చేస్తుంటారు. బొమ్మల వ్యాపారులైతే అమ్మినా అమ్మకపోయినా హోల్‍సేల్‍ వ్యాపారులకు రోజూ డబ్బులు కట్టాలి. దీనికోసం వీరు దొరికినకాడల్లా అప్పులు చేసి కడుతున్నారు. రోజు రోజుకూ అప్పులు పెరిగి భారంగా మారుతున్నాయి. భక్తులు రాకపోవడంతో వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రోజుకు కనీసం రూ.200 వ్యాపారం కూడా నడవడం లేదు.

లెక్కలే చెబుతున్నయ్​

భద్రాచలంలో ప్రస్తుత పరిస్థితిని దేవస్థానం లెక్కలే చెబుతున్నాయి. సాధారణంగా ప్రతి శని, ఆదివారాల్లో సీతారామచంద్రస్వామి దేవస్థానానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ రెండు రోజుల్లో సరాసరి రోజుకు వందకు పైగా నిత్య కల్యాణాలు జరుగుతాయి. కానీ కొంతకాలంగా శని, ఆదివారాలు కూడా సాధారణ రోజుల్లానే గడిచిపోతోంది. ప్రతి ఆదివారం ప్రసాదాలు, సత్రాల అద్దెలు, ఇతర రూపేణా రూ.8 లక్షల ఆదాయం వస్తుంది. కానీ గత ఆదివారం రూ.5.74 లక్షలు మాత్రమే వచ్చింది. సోమవారం రూ.3.10 లక్షలు, మంగళవారం రూ.2.53 లక్షలు, బుధవారం రూ.2.36 లక్షలు, గురువారం రూ.3.99 లక్షలు, శుక్రవారం రూ.2.50 లక్షలు ఆదాయం వచ్చింది.

భక్తులు తగ్గిన మాట వాస్తవమే

పిల్లలకు పరీక్షల సమయంతోపాటు కరోనా ఎఫెక్ట్ తో భక్తులు తగ్గిన మాట వాస్తవమే. ఇప్పటికే పాపికొండల లాంచీలు తిరగకపోవడంతో భక్తులు రావడం లేదు. ప్రతి వీకెండ్‍లో భక్తులతో ఆలయం రద్దీగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. శ్రీరామనవమికి అంతా సర్దుకుని భక్తులు వచ్చే అవకాశం ఉంది. శ్రీరామనవమికి భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నాం.

                                                                                                                                   – శ్రావణ్ కుమార్, ఏఈవో