పాతబస్తీలో కాల్పుల కలకలం

పాతబస్తీలో కాల్పుల కలకలం

హైదరాబాద్‌ పాతబస్తీలోని  మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో  కాల్పులు కలకలం రేపాయి. ఇంటి కొనుగోలు విషయంలో రెండు వర్గాల వివాదం  చోటుచేసుకోవడంతో అడ్వకేట్ ముర్తుజా లైసెన్స్‌ ఉన్న పిస్టల్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మూర్తుజాను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే..

అరాఫత్‌ అనే వ్యక్తి మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్నిరోజుల క్రితం ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అయితే దానికి సంబంధించి గత కొన్ని రోజులుగా రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి..ఆ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించాడు. అయితే పక్కింటివారు గొడవ చేశారు. ఆ ఇంటిపై కోర్టులో కేసు ఉండగా ఎలా కొంటారని పక్కింటితో కలిసి అడ్వొకేట్ మూర్తుజా గొడవకు దిగారు. అరాఫత్ ను  భయపెట్టడానికి ముర్తుజా తన వద్ద ఉన్న తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈక్రమంలో ఇరువర్గాలకు చెందినవారు రాళ్లు.. కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదే వ్యవహారంలో రెండు వర్గాలు గతంలో  పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. కోర్టుకు కూడా వెళ్లారు. అయితే గత జూన్ 17వ తేదీన శనివారం మరోసారి మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌లో అరాఫత్ కేసుపెట్టారు.