గిన్నిస్ రికార్డ్ లో​ అవకాడో

గిన్నిస్ రికార్డ్ లో​ అవకాడో

ఓ చిన్న అవకాడో.. మహా అయితే 170 గ్రాములుంటుంది. అదే పెద్దదైతే ఓ కిలో వరకు తూగుతుంది. కానీ, హవాయిలోని ఓ ఫ్యామిలీ పండించిన అవకాడో దానికి డబుల్​ ఉంది. 2.55 కిలోల బరువుతో గిన్నిస్​ రికార్డుల్లోకెక్కింది. హవాయికి చెందిన జూలియన్​ పోకిని అనే ఆమె తన బావ ఇచ్చిన విత్తనంతో ఈ అవకాడో చెట్టును పెంచింది. అయితే, ఆ చెట్టుకు పండిన అవకాడో ఇంత పెద్దగా వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. పండు పెరుగుతున్న కొద్దీ చెట్టుకే ఉంచామని, పది నెలల పాటు దానిని కొయ్యకుండా ఉన్నామని వివరించింది. ఆ పండుకు గిన్నిస్​ రికార్డు కూడా ఊరికే ఏం రాలేదు. ఎంతో ఓపికగా ఎదురుచూసింది ఆ కుటుంబం.

దాదాపు మూడు నెలలు వేచి చూసింది. తమ అవకాడోకు ఎందుకు రికార్డు ఇవ్వాలో వివరిస్తూ సరైన ఆధారాలు పంపించింది. అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించాకే గిన్నిస్​ బుక్కోళ్లు దానికి ప్రపంచంలోనే అతిపెద్ద అవకాడోగా రికార్డు ఇచ్చారు. జూలియన్​ కొడుకు తల సైజంత ఉందీ అవకాడో. కాగా, అంతకుముందు ప్రపంచంలోనే అతిపెద్ద అవకాడోగా హవాయికే చెందిన ఫెలిసిడాడ్​ పసాలో అనే మహిళ పండించిన అవకాడోకు ఉండేది. 2018 జనవరిలో గిన్నిస్​ రికార్డు పొందిన ఆ అవకాడో బరువు 2.50 కిలోలు. ఇప్పుడు జస్ట్​ 50 గ్రాముల తేడాతో పాత రికార్డును పోకినీ అవకాడో బీట్​ చేసింది.