అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు

అజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు

దేశవ్యాప్తంగా అజాదీ కా అమృత్ మహోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా అన్నిచోట్లా తిరంగా ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా హైదరాబాద్  దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు ఫ్రీడమ్ రైడ్ నిర్వహించారు. ఈ రైడ్ ను సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. 

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ లో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ హరీష్, మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, పోలీసులు, కార్పొరేటర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. 

వికారాబాద్ జిల్లా పరిగిలో వివిధ పాఠశాలల విద్యార్థులు, యువత తిరంగ యాత్ర ర్యాలీ నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. దాదాపు 300 మీటర్ల జాతీయ పతాకంతో కోడంగల్ చౌరస్తా నుండి పరిగి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్య్రం సాధించిన మహనీయులను స్మరించుకుంటూ నినాదాలు చేశారు.

జగిత్యాల జిల్లాలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు ఘనంగా జరిగాయి. రాయికల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆజాదీ కా గౌరవ్ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొని డ్యాన్స్ చేసి అందరినీ హుషారెత్తించారు. 
 

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు తిరంగ మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మాజీ ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలలో తాము ఎల్లప్పుడు ముందుంటామని ప్రజ్ఞ గ్రూప్ సభ్యులు తెలిపారు.

అజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అధ్వర్యంలో మిర్జాలగుడా చౌరస్తా నుండి నేరేడ్మెట్ క్రాస్ రోడ్స్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. మరో పక్క బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అధ్వర్యంలో స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. సఫీల్గూడా నుండి మల్కాజిగిరి చౌరస్తా వరకు 150 అడుగుల భారీ జెండాతో ఈ ర్యాలీ కొనసాగింది. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా  కరీంనగర్ పోలీసులు తిరంగ ర్యాలీ నిర్వహించారు. నగరంలో నిర్వహించిన భారీ ఆటో ర్యాలీని సీపీ సత్యానారాయణ ప్రారంభించారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ములుగులో తిరంగ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి బస్ స్టాండ్ వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.