RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్

RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్

ఐపీఎల్ 17లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్,  ఇంగ్లాండ్ స్టార్ విల్ జాక్స్, క్రిస్ గేల్ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఐపీఎల్ లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు.  అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో విల్ జాక్స్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ చేసి తన జట్టుకు రికార్డు విజయాన్ని అందించాడు.  జాక్స్ మెరుపు ఇన్నింగ్స్ తో.. గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని  బెంగళూరుకు కేవలం 16 ఓవర్లలోనే చేధించింది. దీంతో టోర్నమెంట్ చరిత్రలో అత్యంత వేగంగా 200-ప్లస్ ఛేజింగ్ రికార్డును బద్దలు కొట్టింది.

ఈ క్రమంలో  జాక్స్ కూడా అతి తక్కువ బంతుల్లో ఇన్నింగ్స్‌లో రెండవ యాభై పరుగులు చేసిన క్రిస్ గేల్  ఆల్-టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. జాక్స్.. మొదటి 50 పరుగుల కోసం 31 బంతులు తీసుకోగా.. ఆ తర్వాత కేవలం 10 బంతుల్లో మరో 50 పరుగులు చేసి శతకాన్ని నమోదు చేశాడు. చివరి 10 బంతుల్లో 6, 2, 6, 4, డాట్,6, 6, 4, 6, 6  బాది ఈ సీజన్ రెండో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాటర్ నిలిచాడు.

కాగా, 2013లో పూణే వారియర్స్ ఇండియాపై ఆర్సీబీ తరుపున క్రిస్ గేల్.. అర్థశతకం నుంచి సెంచరీ చేసేందుకు13 బంతులు తీసుకున్నాడు. ఇప్పుటివరకు ఇదే.. ఐపీఎల్ లో అత్యంత తక్కువ బంతుల్లో 50 పరుగుల నుంచి సెంచరీ సాధించిన రికార్డుగా ఉంది. ఈ రికార్డును తాజాగా జాక్ బ్రేక్ చేశాడు.

ఇక, IPL చరిత్రలో మొత్తంగా జాక్ సెంచరీ ఐదవ వేగవంతమైనది. ప్రస్తుత సీజన్‌లో అత్యంత వేగవంతమైన శతకం సాధించిన రికార్డు సన్ రైజర్స్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ పేరిట ఉంది. RCBతో జరిగిన మ్యాచ్ లో హెడ్ కేవలం 39 బంతుల్లో శతకం బాదాడు.  దీంతో హైదరాబాద్ జట్టుఈ మ్యాచ్ లో 287 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.

ఐపీఎల్ లో అత్యంత తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన బ్యాటర్స్:

  • 2013లో  పూణె వారియర్స్ పై 30 బంతుల్లో క్రిస్ గేల్ సెంచరీ సాధించాడు.
  • 2010లో  ముంబై ఇండియన్స్ పై 37 బంతుల్లో యూసుఫ్ పఠాన్ సెంచరీ సాధించాడు.
  • 2013లో  బెంగళూరుపై 38 బంతుల్లో డేవిడ్ మిల్లర్ సెంచరీ సాధించాడు.
  • 2024లో  బెంగళూరుపై 39 బంతుల్లో ట్రావిస్ హెడ్ సెంచరీ సాధించాడు.
  • 2024లో  గుజరాత్ పై 41 బంతుల్లో విల్ జాక్స్ సెంచరీ సాధించాడు.