- కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నం
- తలసాని యాదవ్ ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రులు శ్రీధర్ బాబు, శ్రీహరి
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని, రిజర్వేషన్ల పెంపుకోసం కేంద్రంపై తెస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాల కంటే తమకే ఎక్కువ ఆవేదన, ఆందోళన ఉన్నాయని పేర్కొన్నారు. జీరో అవర్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బీసీ రిజర్వేషన్లు పెంపు అంశాన్ని ప్రస్తావించారు.
దీనికి మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి స్పందించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం కొనసాగిస్తోందని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ అంశంపై ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు భారీ ధర్నా చేపట్టామని, ఇతర రాష్ట్రాలు, పార్టీల ఎంపీలు సైతం వచ్చి మద్దతు తెలిపారని, కానీ ప్రతిపక్ష బీఆర్ ఎస్ పార్టీ మాత్రం ధర్నాకు గైర్హాజరైందని గుర్తుచేశారు. రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రం 9వ షెడ్యూల్ లో చేర్చాలని డిమాండ్ చేశారు.
బీసీలకు 20 వేల కోట్లు కేటాయించాలి: తలసాని
జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు ఈ బడ్జెట్ లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి రూ.20 వేల కోట్ల చొప్పున బీసీల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని ఎన్నికల ముందు కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 2 బడ్జెట్లు అయిపోయాయని, ఈనెల 20న ప్రభుత్వం పెట్టే బడ్జెట్ లో రూ.20 వేల కోట్ల కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ.10 వేల కోట్లు ఉన్నాయని, వెంటనే వాటిని చెల్లించాలన్నారు. బీసీ స్టూడెంట్స్ విదేశాల్లో ఉన్నత చదువులు చదివేందుకు తమ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓవర్ సిస్ స్కాలర్ షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్ లో చేరిస్తేనే చట్టబద్ధత వస్తుందని తాము చెప్పినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
