- రాజకీయ పార్టీలకు అతీతంగా ఐక్యం కావాలి
- బీసీ ప్రజాప్రతినిధుల సమావేశంలో బీసీ నేతల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధమైన బీసీ సబ్ ప్లాన్ అమలు కోసం బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ ప్రజాప్రతినిధుల గెట్-టు-గెదర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకాటి శ్రీహరి మాట్లాడుతూ బీసీ ప్రజాప్రతినిధుల సమావేశానికి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.
అనంతరం బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో సుమారు 60 శాతం ఉన్న బీసీల అభివృద్ధికి చట్టబద్ధమైన సబ్ ప్లాన్ అవసరమన్నారు. బీసీ సబ్ ప్లాన్ సాధన కోసం త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తామని ఆయన తెలిపారు. బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, మకన్ సింగ్ ఠాకూర్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు తదితరులు పాల్గొన్నారు.
