RCB- RR Sale: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కి ముందు పలు జట్లు అమ్మకానికి సిద్ధమయ్యాయి. గత సీజన్ లో ఛాంపియన్ గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అమ్మకం తుది దశకు చేరుకుందన్న వార్తలతో మరో ఐపీఎల్ ఛాంపియన్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కూడా విక్రయానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా వచ్చిన నివేదికల ప్రకారం రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం తమ వాటాల్లో కొంత భాగాన్ని అమ్మేందుకు చూస్తున్నట్లు తెలుస్తుంది.
కాగా ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు ఇటీవల భారీగా పెరిగిపోయాయి. దీంతో పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు, పెట్టుబడిదారులు ఈ జట్లని కొనుగోలుపై ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రముఖ కార్పొరేట్ సంస్థలు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలుకు బిడ్లు వేయడానికి రెడీ అయినట్లు క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ టీమ్ మెజారిటీ వాటాదారుడైన మనోజ్ బదలే తన వాటాను పూర్తిగా అమ్మాలని చూస్తున్నారు. రాజస్థాన్ విలువ దాదాపు 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 9,100 కోట్లు) ఉండగా.. బిడ్డింగ్‌లో రూ. 10,168 కోట్ల నుంచి రూ. 12,479 కోట్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ జట్టు కోసం దిగ్గజ కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. అయితే రాజస్థాన్ రాయల్స్ విక్రయంపై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే ఛాన్స్ ఉంది.
మరోవైపు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విక్రయానికి సంబంధించిన చర్చలు బోర్డు రూముల్లో భారీ స్థాయిలో ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత యజమాని డయాజియో (యునైటెడ్ స్పిరిట్స్) ఈ ఫ్రాంచైజీని అమ్మేందుకు సిద్ధమైంది. డయాజియో సంస్థ ఈ విక్రయ ప్రక్రియను మార్చి 31వలోపు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఈ చర్చలు ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరినట్లు టాక్. రజత్ పటీదార్ ఆధ్వర్యంలోని ఆర్సీబీ జట్టు మార్చి 28వ తేదీన చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. సరిగ్గా టోర్నీ ప్రారంభమయ్యే సమయంలోనే ఈ భారీ డీల్ కొనసాగుతుంది.
అయితే ఆర్సీబీ ఫ్రాంచైజీ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ. 16,600 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా. 2021లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టును రూ. 7,000 కోట్లకు కొనుగోలు కాగా.. ఇప్పుడు ఆర్సీబీ ధర రెట్టింపు కంటే ఎక్కువగా ఉండనుంది. భవిష్యత్తులో మీడియా హక్కుల ధరలపై ఉన్న అనిశ్చితి వల్ల కొంతమంది బిడ్డర్లు వెనక్కి తగ్గినప్పటికీ, ఆర్సీబీకి ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగానే భారీ ధరకి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఆర్సీబీ కోనుగోలు రేసులో ఇద్దరు ప్రధాన బిడ్డర్లు నిలిచారు. రంజన్ పాయ్ కన్సార్టియం: మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ పాయ్, అమెరికాకు చెందిన కోల్‌బర్గ్ క్రావిస్ రాబర్ట్స్, సింగపూర్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ టెమాసెక్ తో కలిసి ఈ బిడ్ దాఖలు చేయగా.. ఈక్యూటీ (EQT): స్వీడన్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ సింగిల్ గా లేదా స్థానిక ఇండియన్ కంపెనీతో కలిసి బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు యోచిస్తుంది.
