- మహేశ్ గౌడ్ నాయకత్వాన్ని కించపరుస్తారా?: అనిల్
- బీసీల నాయకత్వమంటే మంత్రి వెంకట్ రెడ్డికి అంత చులకనా? : మెట్టు సాయి
- పీసీసీ చీఫ్‌తో ఖర్గే, కేసీ వేణు గోపాల్ ఆరా, కోమటి రెడ్డి కామెంట్లపై అసంతృప్తి
హైదరాబాద్, వెలుగు: జగ్గారెడ్డి పీసీసీ ఛీప్అయితే వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ బీసీ నేతలు గరం అవుతున్నారు. మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి, పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ మంత్రి తీరును తప్పుపట్టారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ నాయకత్వాన్ని మంత్రి వెంకట్ రెడ్డి తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారని, ఆయన వ్యాఖ్యల వెనుక ఆంతర్యమేమిటని ఈరవత్రి అనిల్ ప్రశ్నించారు.
ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మహేశ్ గౌడ్ నాయకత్వాన్ని చులకన చేసేలా మంత్రి మాట్లాడడం బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిందన్నారు. బీసీల నాయకత్వం అంటే కోమటిరెడ్డికి అంత చులకన ఎందుకని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ నిలదీశారు. మహేశ్ గౌడ్ నాయకత్వంలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందని గుర్తుచేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది మహేశ్ గౌడ్ నాయకత్వంలో కాదా? అని ప్రశ్నించారు. సమర్థవంతంగా పనిచేస్తున్న బీసీ నేతను పక్కనపెట్టి అగ్రవర్ణానికి చెందిన మరో నేతకు పదవి ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి కోరడం దేనికి సంకేతం అని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ ఫైర్ అయ్యారు. మహేశ్‌గౌడ్ నాయకత్వాన్ని తక్కువ చేయడం అంటే పార్టీ సాధించిన విజయాలను అవమానించడమేనని ఆరోపించారు.
సీఎం గుస్సా
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆయన వెంకట్ రెడ్డికి ఫోన్ చేసి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారని నిలదీసినట్టు సమాచారం. మంగళవారం సీఎంతో పాటు మహేశ్‌కుమార్ గౌడ్ ఢిల్లీలోనే ఉన్నారు. దాంతో హైకమాండ్ మంత్రి వ్యాఖ్యలపై ఆరా తీసినట్టు తెలుస్తోంది.
పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ ను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ కలిసిన సందర్భంలో ఈ విషయం ప్రస్తావనకు రాగా.. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీలో ఐక్యతను దెబ్బతీస్తాయని పేర్కొన్నట్టు సమాచారం. మంత్రి తీరుపై అగ్రనేతలిద్దరు అసహనం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
నా మాటల వెనుక దురుద్దేశం లేదు: వెంకట్ రెడ్డి
తన వ్యాఖ్యలపై హైకమాండ్ ఆగ్రహంతో ఉందని గుర్తించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాకు వివరణ ఇచ్చుకున్నారు. మహేశ్ గౌడ్ నాయకత్వంపై తాను ఎలాంటి కామెంట్లు చేయలేదని, ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని కోమటిరెడ్డి గుర్తుచేశారు.
సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరైన తాను అక్కడి ఏర్పాట్లు, హాజరైన జనాన్ని చూసి అలా మాట్లాడానని చెప్పారు. తన మాటల వెనుక వేరే ఉద్దేశం లేదన్నారు. పీసీసీ చీఫ్ ను తొలగించాలన్నది తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా కొందరు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
