- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో జర్నలిస్టుల సంక్షేమం, భద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ మీడియా రంగాన్ని ప్రోత్సహించేందుకు త్వరలోనే సమగ్రమైన ‘డిజిటల్ మీడియా పాలసీ’ ని తీసుకురానున్నట్టు తెలిపారు.
మంగళవారం శాసనమండలిలో జర్నలిస్టుల సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రతి జర్నలిస్టుకు అక్రెడిటేషన్ కార్డులు అందజేస్తామన్నారు. జర్నలిస్టు సంఘాల సూచనల మేరకు జీఓలో మార్పులు చేశామని వెల్లడించారు. జర్నలిస్టుల చిరకాల కోరికైన ఇండ్ల స్థలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సానుకూల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా అర్హులకు స్థలాలు కేటాయించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టుల మధ్య ప్రభుత్వం ఎలాంటి తేడా చూపదని, అందరిని సమానంగానే పరిగణిస్తామని వెల్లడించారు.
ఏప్రిల్, -మేలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శాసనమండలిలో హౌసింగ్‌పై సభ్యుల ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. ఏప్రిల్, మే నెలల్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయని, ఈ నెలాఖరుకి దాదాపు లక్ష ఇళ్లు పూర్తికానున్నాయని తెలిపారు. జూన్, జూలై నాటికి మూడు లక్షల ఇళ్లలో మెజార్టీ నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఒకసారి చేసే కార్యక్రమం కాదని, శాశ్వత ప్రక్రియ అన్నారు.
వచ్చే మూడేళ్లలో పట్టణ ప్రాంతాల్లోని ప్రతి వార్డులో ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి వివక్ష ఉండదని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన తండాలు, గూడాల్లో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. డబుల్ బెడ్‌రూమ్ పథకంలో పెండింగ్ బిల్లులలో 99 శాతం చెల్లించామని, మిగతావి త్వరలో క్లియర్చేస్తామన్నారు. ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
