హద్దులు దాటిన అశ్లీలత.. వివాదంలో కేడీ పాట

హద్దులు దాటిన అశ్లీలత.. వివాదంలో కేడీ పాట

కన్నడ హీరో ధ్రువ సర్జా హీరోగా ప్రేమ్‌‌‌‌ దర్శకత్వంలో కేవీఎన్‌‌‌‌ ప్రొడక్షన్స్‌‌‌‌ నిర్మిస్తున్న పాన్‌‌‌‌ ఇండియా మూవీ ‘కేడీ: ది డెవిల్‌‌‌‌’.  ఈ మూవీ హిందీ వెర్షన్‌‌‌‌కు సంబంధించి ఇటీవల విడుదలైన  ‘సర్కే చునర్‌‌‌‌‌‌‌‌ తేరి సర్కే’ అనే పాటపై దేశవ్యాప్తంగా వివాదం ముసురుకుంది. ఈ పాటలో పాటలోని సాహిత్యం మొదలు నోరా ఫతేహి వేసిన హుక్‌‌‌‌ స్టెప్పులు,  ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ అసభ్యకరంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. 

పాటపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని న్యాయవాది, సామాజిక కార్యకర్త వినీత్‌‌‌‌ జిందాల్‌‌‌‌ ఢిల్లీ పోలీస్‌‌‌‌ సైబర్‌‌‌‌ సెల్‌‌‌‌లో ఫిర్యాదు చేశారు.  అసభ్యతను ప్రోత్సహించేలా ఈ పాట ఉందని, యువతపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్న వినీత్.. ఇందులో లిరిసిస్ట్ రాకీబ్ ఆలం, డైరెక్టర్ ప్రేమ్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య, గాయని మంగ్లీ పేర్లను పేర్కొన్నారు. క్రికెటర్‌‌‌‌ హర్భజన్‌‌‌‌ సింగ్‌‌‌‌.. పాటలో నటించిన సంజయ్‌‌‌‌ దత్‌‌‌‌, నోరా ఫతేహిపై విమర్శలు గుప్పించారు. బాలీవుడ్ నటి,  బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌‌‌‌ ఫైర్ అయ్యారు.  బాలీవుడ్ అశ్లీలతకు పరాకాష్టగా మారిందని, ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరారు.   

‘కమర్షియల్ సాంగ్ రైటింగ్ ఇంతలా దిగజారిపోవడం బాధాకరం’ అని సింగర్ అర్మాన్ మాలిక్ ట్వీట్ చేశారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు సెన్సార్ బోర్డుకు కూడా ఈ పాటను నిషేధించాలని ఫిర్యాదులు అందాయి.  ఈ ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం, ఈ పాటను అన్ని డిజిటల్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి తక్షణమే తొలగించాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. ఇలాంటి వివాదాస్పద కంటెంట్ ప్రజల్లోకి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా నిబంధనలను సమీక్షించాలని సూచించింది.