హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ టౌన్‌లో నిర్వహించే వార సంత(అంగడి) వేలం ఈసారి రూ.2 కోట్లు పలికి రికార్డు సృష్టించింది. బుధవారం జరిగిన వేలంలో రెడ్డికాలనీకి చెందిన ఐలేని రాజమహేందర్ రెడ్డి అంగడిని దక్కించుకున్నారు. గతేడాది రూ.91 లక్షలు పలికిన వేలం, ఈసారి డబుల్ కావడంతో మున్సిపాలిటీకి భారీ ఆదాయం వచ్చింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ పద్మ, కమిషనర్ మల్లికార్జున్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
నవీపేట్‌లో మేకల సంత వేలం రూ.1.02 కోట్లు..
నవీపేట్: నిజామాబాద్ జిల్లా నవీపేట్‌లో ప్రతి శనివారం జరిగే మేకల సంత వేలం ఈసారి రూ.1.02 కోట్లు పలికింది. బుధవారం నిర్వహించిన వేలంలో 159 మంది పాల్గొన్నారు. గతేడాది రూ.61 లక్షలకు దక్కించుకున్న మహ్మద్ సిరాజుద్దీన్.. ఈసారి రూ.1 కోటి 2 లక్షలకు సంతను దక్కించుకున్నారు. ఈ మేకల సంత రాష్ట్రంలోనే అత్యధికంగా వేలం పలికిన సంతగా నిలిచిందని పంచాయతీ సెక్రటరీ రవీందర్ నాయక్ తెలిపారు.
