న్యూఢిల్లీ, వెలుగు: సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ పెంచాలని కోల్ మైన్స్ పెన్షన్ స్కీం(సీఎంపీఎఫ్) కమిషనర్, కోల్ కంట్రోలర్ సజీశ్ కుమార్‌కు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో కమిషనర్‌ను కలిసి.. సింగరేణి కార్మికుల అంశాలపై చర్చించారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో సీఎంపీఎఫ్ –1998 కింద పదవీ విరమణ చేసిన సింగరేణి బొగ్గు కార్మికుల పెన్షన్ సమస్యలపై కీలకంగా చర్చించారు.
ప్రస్తుతం సింగరేణి నుంచి రిటైర్ అయిన కార్మికులకు వస్తున్న పెన్షన్ చాలా తక్కువగా ఉండటంతో వారు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కమిషనర్ దృష్టికి ఎంపీ వంశీ కృష్ణ తీసుకెళ్లారు. జీవితాంతం కష్టపడి పనిచేసిన కార్మికులు గౌరవప్రదమైన జీవితం గడపాలంటే వారి పెన్షన్లు తక్షణమే పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణించి, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెరిగే వరకు తాను పోరాడుతూనే ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. తన విజ్ఞప్తిపై అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సజీష్ కుమార్ హామీ ఇచ్చారని ఎంపీ వెల్లడించారు.
