ఈ అప్పులతో 3 ట్రిలియన్ డాలర్లు ఎట్ల సాధ్యం?...రాష్ట్రంలో భూ కుంభకోణాలు పెరిగినయ్ : బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి

ఈ అప్పులతో 3 ట్రిలియన్ డాలర్లు ఎట్ల సాధ్యం?...రాష్ట్రంలో భూ కుంభకోణాలు పెరిగినయ్ : బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి
  •     నిషేధిత జాబితాలోకి కోటి ఎకరాల భూములు ఎలా చేరాయి?
  •     రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: ఓ వైపు రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతే, ప్రభుత్వ పెద్దలు మాత్రం మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందనే భ్రమలు కల్పిస్తున్నారని,  ఇది ఎలా సాధ్యమో చెప్పాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్​రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు 5 శాతం పడిపోయాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన రైతుల విషయంలో యమపాశంగా మారిందన్నారు. ఉత్తర తెలంగాణలో జరిగిన పంట నష్టానికి  ఇంత వరకు పరిహారం ఇవ్వలేదని, రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారని చెప్పారు. 

బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వ సొంత డబ్బా తప్ప మరేమీ లేదన్నారు. గవర్నర్ ప్రసంగం హామీల ఎగవేతకు డిక్లరేషన్​గా ఉందని విమర్శించారు. మక్కలు కొనడం లేదని, కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వడం లేదన్నారు. రైతులకు ఎరువులు సకాలంలో అందడం లేదని, బ్లాక్ మార్కెట్ లో ఎక్కువ డబ్బులిచ్చి కొనుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యకు 15 శాతం కేటాయిస్తామని చెప్పి 8 శాతమే బడ్జెట్ కేటాయించారన్నారు. 2,245 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా లేరని, మౌలిక వసతులు లేవన్నారు.  ఫీజు రీయింబర్స్​మెంట్ రూ.10 వేల కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు.   

రాష్ట్రంలో భూ కుంభకోణాలు

రాష్ట్రంలో భూ కుంభకోణాలు జరుగుతున్నాయని, తన దగ్గర ఆధారాలున్నాయని, త్వరలోనే బయట పెడుతానని బీజేఎల్పీ నేత మహేశ్వర్​రెడ్డి పేర్కొన్నారు. నిషేధిత జాబితాలోకి కోటి ఎకరాల భూమి ఎలా చేరిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్లు, భూ దందాలు చేసుకోవడానికి జాబితాలో చేరుస్తున్నారని ఆరోపించారు. ఎన్​ఓసీ అంటే ‘నో అబ్జెక్షన్ టు సీఎం’.. అని ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్ పై ఫోరెన్సిక్ ఆడిట్ అని చెప్పి 15 నెలలు అవుతున్నదని, ఎప్పుడు పూర్తి చేస్తారని, బాధ్యులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని ప్రశ్నించారు. 

పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు నడిపిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. వెలుగుమట్లలో పేదల ఇండ్లు కూల్చినప్పుడు ప్రభుత్వానికి కండ్లు కనిపించలేదా? అని ప్రశ్నించారు. ఏజెన్సీలు ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులను దోచుకుంటున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించి, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్​ చేశారు.