హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ నేషనల్ క్యాంప్‌!

హైదరాబాద్‌లో బ్యాడ్మింటన్ నేషనల్ క్యాంప్‌!

న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌‌ తదితరులకు గుడ్‌‌న్యూస్‌‌. బ్యాడ్మింటన్‌‌ అసోసియేషన్‌‌ ఆఫ్ ఇండియా (బాయ్) హైదరాబాద్‌‌లో నేషనల్‌‌ క్యాంప్‌‌ కండక్ట్‌‌ చేయాలని నిర్ణయించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తే జులై 1వ తేదీ నుంచి సింధు అండ్‌‌ కో మూడు నెలల తర్వాత తిరిగి కోర్టులోకి రానున్నారు. కొన్ని ఆటల్లో ట్రెయినింగ్ రీస్టార్ట్‌‌కు స్పోర్ట్‌‌ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) గత నెలలో అనుమతివ్వడంతో బెంగళూరులోని ప్రకాశ్ పదుకోన్‌‌ బ్యాడ్మింటన్ అకాడమీ (పీపీబీఏ)లో పలువురు షట్లర్లు ఇప్పటికే ప్రాక్టీస్‌‌ మొదలుపెట్టారు. కానీ, హైదరాబాద్‌‌లో కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో స్పోర్ట్స్‌‌ కాంప్లెక్స్‌‌లు, స్టేడియాలపై గవర్నమెంట్‌‌ ఈనెల 30 వరకూ ఆంక్షలు పొడిగించింది. దాంతో సిటీ లో ఉన్న పలువురు టాప్‌‌ ప్లేయర్లకు నిరీక్షణ తప్ప లేదు. అయితే, పరిస్థితులను విశ్లేషించిన తర్వాత వచ్చే నెల 1 నుంచి హైదరాబాద్‌‌లో ట్రెయినింగ్‌‌ క్యాంప్స్‌‌ స్టార్ట్‌‌ చేయాలని నిర్ణయించినట్టు బాయ్‌‌ సెక్రటరీ అజయ్‌‌ సింఘానియా తెలిపారు. అయితే, దీనికి స్టేట్‌‌ గవర్నమెంట్‌‌ పర్మిషన్‌‌, అప్రూవల్‌‌ కావాలన్నారు. కానీ, రాష్ట్రంలో ముఖ్యంగా, హైదరాబాద్‌‌లో వైరస్‌‌ వ్యాప్తి ప్రస్తుతం విపరీతంగా ఉంది. రోజూ వందల కేసులు వస్తున్నాయి. మరి, సర్కారు ఏం చేస్తుందనేది చూడాల్సి ఉంది.

సెప్టెంబర్ వరకూ టోర్నీల్లేవు

కరోనా ప్రభావం దృష్ట్యా లక్నోలో జరగాల్సిన సీనియర్ నేషనల్‌‌ చాంపియన్‌‌షిప్స్‌‌ను బాయ్‌‌ మార్చిలోనే పోస్ట్‌‌పోన్‌‌ చేసింది. అన్ని రాష్ట్ర సంఘాల సెక్రటరీలతో చర్చించిన తర్వాత సెప్టెంబర్ వరకూ ఎలాంటి డొమెస్టిక్‌‌ పోటీలు నిర్వహించకూడదని తాజాగా నిర్ణయించింది. సెప్టెంబర్‌‌లో మరోసారి సమీక్ష నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. కాగా, ఈ ఏడాది ఇండియా ఆతిథ్యం ఇవ్వాల్సిన నాలుగు ఇంటర్నేషనల్‌‌ ఈవెంట్లలో రెండు టోర్నీలు రద్దయ్యాయి. హైదరాబాద్ ఓపెన్, ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్‌‌ గ్రాండ్ ప్రి రద్దవగా.. మార్చిలో జరగాల్సిన ఇండియా ఓపెన్‌‌ డిసెంబర్​కు పోస్ట్‌‌ పోన్‌‌ అయింది.