ఏనుగుల స్నానం

ఏనుగుల స్నానం

అడవిలో ఒక చెరువు ఉంది. చెరువు ఒడ్డున  మర్రి చెట్టు, దాని పైన ఒక కోకిలమ్మ ఉండేది. ఆ కోకిలమ్మ తన చిట్టి కోకిలకు సంగీతం నేర్పిస్తూ ఉండేది. ఆ చెరువు వైపు ఏవి వచ్చినా కోకిలమ్మ పాటలు విని సంతోషించేవి. సాయంత్రం వేళల్లో కోకిలమ్మ పాట కోసమే చెరువుగట్టుకు జంతువులన్నీ చేరుకునేవి. తన చిట్టి కోకిలకు సంగీతంలో స్వరాలన్నీ నేర్పించింది  కోకిలమ్మ. ఆ చిట్టి కోకిల చక్కగా రాగం తీస్తూ మొదలుపెట్టి చివర్లో ఏదో ఆలోచనతో ఆ పాట చెడగొట్టేది. దాంతో ఆ పాట అందం పోయేది. కోకిలమ్మ చాలాసార్లు చిట్టి కోకిలను కోప్పడి, ‘‘చిట్టీ! మనం ఏ పని చేసినా ఆ పనిని  శ్రద్ధగా, పూర్తిగా , అందంగా చేయాలి. అంతేగాని సగం సగం పనులు చేయకూడదు!’’ అని చెప్తుండేది. కానీ చిట్టి కోకిల తల్లి మాటలు పట్టించుకునేది కాదు

.
ఒకరోజు ఒక కాకమ్మ మర్రి చెట్టు మీద వాలింది. ‘‘మిత్రమా! రేపు మృగరాజు సింహం పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. వేడుకలో చిట్టి కోకిల పాటకచేరి ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి ఎలుగుబంటి ఈ విషయం నీకు చెప్పమని నన్ను పంపారు’’ అంది కాకి.
ముందు పాట కచేరి అనగానే మృగరాజు ఎంతో సంతోషించింది కోకిలమ్మ. తన చిట్టికి మృగరాజు పుట్టినరోజు వేడుకలో పాడే అవకాశం దొరికినందుకు సంతోషించింది కోకిలమ్మ.


‘‘ఇది మంచి అవకాశం. నువ్వు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మృగరాజు మన్ననలు పొందాలి !’’ అంది కోకిలమ్మ.
నిజానికి చిట్టి కోకిలకు సంగీతంలో అన్ని మెళకువలు తెలుసు. చక్కటి స్వరంతో పాడి మెప్పిస్తుంది. కానీ ఏ పాటనూ పూర్తిగా పాడదు. మధ్యలోనే ఏదో ఆలోచనతో ఆపేస్తుంది.


ఇంతలో ఆ చెరువు ఒడ్డుకు ఏనుగుల గుంపు వచ్చింది. అవి పొలోమంటూ చెరువులోకి దూకాయి. ఒంటి మీద ఉన్న మట్టిని, బురదను శుభ్రం చేసుకోసాగాయి. చెరువు మధ్యలోకి వెళ్లి ఎంతో ఆనందంతో ఆటలాడాయి! గెంతులు వేశాయి!! ఇదంతా చెట్టు పై నుంచి చూస్తున్న చిట్టి కోకిల ‘‘అమ్మా!  ఆ ఏనుగుల్ని చూసావా!! ఎంత శుభ్రంగా స్నానం చేస్తున్నాయో! వాటికి ఒంటిపైన మట్టి నిలవటం అస్సలు ఇష్టంలేదు కావచ్చు!’’ అంది. అప్పుడు కోకిలమ్మ ‘‘అవును చిట్టీ! అవి ఎంతో శ్రద్ధగా, శుభ్రంగా స్నానం చేస్తున్నాయి. మనం చేసే పని కూడా అలాగే  ఉండాలి’’  అంది కోకిలమ్మ.


కొంతసేపటికి ఏనుగులు స్నానం చేయటం పూర్తి చేసి ఒడ్డు మీదికి వచ్చాయి.  పక్కనే ఉన్న ఎండిపోయిన ఆకులు, చెత్తాచెదారాన్ని తొండంతో తీసి ఒంటికి పూసుకున్నాయి. మట్టిని రుద్దుకున్నాయి.
ఇదంతా గమనిస్తున్న చిట్టి కోకిల ‘‘అమ్మా! ఏనుగులు ఒంటిని నీటితో శుభ్రం చేసుకుని తిరిగి  చెత్తాచెదారాన్ని శరీరానికి రాసుకున్నాయి. స్నానం చేసి ఏం ఉపయోగం?’’ అని అడిగింది.


అప్పుడు కోకిలమ్మ తన చిట్టి కోకిలను దగ్గరికి తీసుకొని ‘‘నిజమే! చెరువులో శుభ్రపరుచుకున్న శరీరాన్ని  ఒడ్డుకు వచ్చి తిరిగి చెత్తాచెదారం పూసుకోవటం వలన ఎలా ఉపయోగం లేదో.. ఏ పని చేసినా సంపూర్ణంగా శ్రద్ధగా చేయకపోయినా  ఉపయోగం ఉండదు” అంది కోకిలమ్మ.


చిట్టి కోకిలకు తన తప్పు తెలిసింది. మర్నాడు మృగరాజు సింహం పుట్టినరోజు వేడుకకు వెళ్లి చక్కగా పూర్తి పాటను లయబద్ధంగా పాడి వినిపించింది. మృగరాజు ఎంతో సంతోషించాడు. చిట్టి కోకిలను మెచ్చుకున్నాడు. అందరి ముందు సన్మానించాడు. బోలెడు కానుకలిచ్చి పంపాడు.


- పైడిమర్రి రామకృష్ణ