ఉత్తమ పోలీస్​స్టేషన్​గా చొప్పదండి

ఉత్తమ పోలీస్​స్టేషన్​గా చొప్పదండి

జాతీయస్థాయిలో 8వ స్థానం
జాబితా విడుదల చేసిన  కేంద్ర హోంశాఖ

చొప్పదండి, వెలుగు: కేంద్ర హోంశాఖ విడుదల చేసిన దేశంలోని ఉత్తమ పోలీస్​స్టేషన్ల జాబితాలో చొప్పదండి టాప్​ 8వ స్థానంలో నిలిచిందని చొప్పదండి సీఐ రమేష్​, ఎస్సై చేరాలు తెలిపారు. ఉత్తమ పోలీస్​స్టేషన్​గా నిలవడంతో గురువారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో 15,660 పోలీస్ స్టేషన్లు ఉండగా వాటిలో ఉత్తమ పోలీస్​స్టేషన్ల ఎంపికను కేంద్ర హోంశాఖ చేపట్టిందన్నారు. ఇందులో 77 స్టేషన్లు షార్ట్​ లిస్ట్​ చేసి టాప్​టెన్​ స్టేషన్ల ఎంపిక కోసం కేంద్ర హోంశాఖ సర్వే నిర్వహించిందన్నారు. సర్వే  టీం సభ్యులు స్టేషన్లో కంప్లైంట్లు ఆన్​లైన్​ చేసే విధానం, రికార్డుల అప్​డేట్​, స్టేషన్ పరిసరాల్లో చేపడుతున్న గార్డెనింగ్ పనులు, దివ్యాంగులకు సౌకర్యాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, రిసెప్షన్​ కౌంటర్, సిబ్బంది నడవడిక, క్రైం జరిగిన వెంటనే డిటెక్ట్​ చేసిన విధానాలను పరిశీలించారని తెలిపారు.

దాంతోపాటు స్టేషన్​లోని స్టాఫ్ పనితీరుపై అన్ని గ్రామాల్లో ఎంక్వైరీ చేశారని అన్నారు. చివరకు నేషనల్ ​లెవల్​లో చొప్పదండి పోలీస్​ స్టేషన్​కు 8వ స్థానం కేటాయించారని తెలిపారు. జాతీయస్థాయిలో టాప్​టెన్​లో నిలిచిన మిగిలిన తొమ్మిది స్టేషన్లు పట్టణాలలో ఉన్నాయని, చొప్పదండి  స్టేషన్​ మాత్రమే రూరల్​ ప్రాంతంలో ఉందని తెలిపారు. ఉత్తమ పోలీస్​స్టేషన్ల జాబితాలో తెలంగాణ రాష్ట్రంలోనే చొప్పదండి ఒక్కటే ఎంపికవడం గర్వకారణమన్నారు. స్టేషన్​ ఈ  ఘనతను సాధించడానికి పోలీస్​కమిషనర్​ ఎంతో సహకారం అందించారన్నారు.