ద్రోహులను పార్టీలో చేర్చుకోవద్దు.. రాజస్థాన్ సీఎల్పీలో ఎమ్మెల్యేలు

ద్రోహులను పార్టీలో చేర్చుకోవద్దు.. రాజస్థాన్ సీఎల్పీలో ఎమ్మెల్యేలు

జైసల్మేర్: మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్‌తో సహా 19 మంది రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి రానిచ్చేది లేదని రాజస్థాన్ కాంగ్రెస్ శాసనసభ్యులు చెప్పారు. సీఎం అశోక్ గెహ్లాట్ కోరికకు విరుద్ధంగా వారిని పార్టీలో తిరిగి చేర్చుకోవద్దన్నారు. జైసల్మేర్‌‌లో ఆదివారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సీఎల్‌పీ) మీటింగ్ నిర్వహించారు. దీంట్లో పార్టీకి ద్రోహం చేసిన పైలట్ క్యాంప్ రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి చేర్చుకోవద్దని అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్ శాంతి ధరివాల్ అన్నారు. ఈ స్టేట్‌మెంట్‌కు మిగతా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అయితే ఈ విషయం హైకమాండ్ అధీనంలో ఉందని, ఇందులో తాను జోక్యం చేసుకోబోనని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) జనరల్ సెక్రటరీ అవినాశ్ పాండే రాజస్థాన్ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని గెహ్లాట్ చెప్పారని అవినాశ్ పేర్కొన్నారు.