భద్రాద్రి రామయ్యకు పైసల పరేషాన్

భద్రాద్రి రామయ్యకు పైసల పరేషాన్
  •     డిసెంబరు 27 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
  •     ఆర్టీసీ సమ్మె, బోటు ప్రమాదంతో తగ్గిన ఆదాయం
  •     వేడుకలకు కోటి రూపాయల వరకు అవసరం
  •     నిర్వహణకు ప్రభుత్వం ఫండ్స్‌‌ విడుదల చేయాల్సిందే.!

శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. 42 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, సెప్టెంబరులో జరిగిన కచ్చలూరు లాంచీ ప్రమాదం ప్రభావం దేవస్థానం ఆదాయంపై తీవ్రంగా పడింది. ఇటీవల 57 రోజుల దేవస్థానం హుండీలను లెక్కిస్తే రూ.75లక్షల 89 వేల 500 ఆదాయం వచ్చింది. ప్రతి నెల దాదాపుగా రూ.65 లక్షల ఆదాయం వచ్చేది. ఈ సారి రూ.37లక్షలకు మించలేదు. ప్రతి నెలా సిబ్బంది జీత భత్యాలకు రూ .కోటి అవసరం అవుతుంది.

హుండీలు తెరిస్తేనే సిబ్బందికి జీతాలు.

లాంచీ ప్రమాదంతో నిలిచిన పాపికొండల టూర్‌‌ మరో నెలరోజులకు కూడా ప్రారంభించే సూచనలు కనిపిస్తలేవు. భద్రాచలం దేవస్థానంలో 95 మంది ఉద్యోగులు, ఔట్‍సోర్సింగ్‍, కాంట్రాక్టు, హౌస్‌‌ కీపింగ్‌‌ సిబ్బంది 200 మంది, ఎస్‍పీఎఫ్‌‌ సిబ్బంది 11 మంది, హోంగార్డులు10 మంది ఉన్నారు. ప్రతీ నెల 1 నుంచి 5వ తేదీ లోపు జీతాలు ఇచ్చేవారు. ఇప్పుడు 20వ తేదీ తర్వాతనే జీతాలు ఇచ్చే పరిస్థితి.

ఏటా ప్రభుత్వానికి రూ.3.50 కోట్లు

ఏటా వచ్చే ఆదాయంలో దేవస్థానం ప్రభుత్వానికి రూ.3.50కోట్లు చెల్లిస్తోంది. సీజీఎఫ్‍(కామన్‌‌ గుడ్‌‌ ఫండ్‍) రూపంలో ఏడాది నికర ఆదాయంపై 5 శాతం చెల్లిస్తున్నారు. చిన్న ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు వెచ్చిస్తున్నారు. ఎండోమెంట్స్ అడ్మినిస్ట్రేటివ్‌‌ ఫండ్‍12 శాతం, అర్చక వెల్ఫేర్‌‌ ఫండ్‌‌ మూడు శాతం, ఆడిట్‌‌ ఫీజు 1.5 శాతం ఏటా దేవస్థానం చెల్లించాల్సి ఉంటుంది. కిందటేడాది దేవస్థానం నికర ఆదాయం రూ.18కోట్లు కాగా పేర్కొన్న వివిధ పన్నుల రూపేణా 21.5శాతం రూ.3.50 కోట్లు చెల్లించారు. ఇటీవల హుండీ ఆదాయం ద్వారా వచ్చిన రూ.1.50 కోట్లు రాష్ట్ర దేవాదాయశాఖకు చెల్లించారు. ఇపుడు హుండీ ఆదాయం తగ్గిపోవడంతో మున్ముందు కష్టాలను ఎలా అధిగమించాలా అని అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో తీర్మానం

ఆలయంలో వైకుంఠ ఏకాదశి, శ్రీరామనవమి ఉత్సవాల నిర్వహణ ఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోరుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే చేసిన తీర్మానం నేటికీ అమలుకు నోచుకోలేదు. వైకుంఠ ఏకాదశికి రూ.కోటి, శ్రీరామనవమికి రూ.కోటి ఖర్చు అవుతోంది. ప్రభుత్వ పండుగలుగా ప్రకటించి రూ.2 కోట్లను సర్కారే భరించాలని తీర్మానం చేసి పంపినా వాటిని బుట్టదాఖలు చేశారు. కనీసం ఇటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లోనైనా ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు.