గ్రేటర్​పై బీజేపీ ఫోకస్​: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్​గా డైరెక్షన్​

గ్రేటర్​పై బీజేపీ ఫోకస్​: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్​గా డైరెక్షన్​

డివిజన్ల​పై పట్టు పెంచుకోవాలని కొత్త కార్పొరేటర్లకు  సూచనలు

నిత్యం ప్రజల్లోనే ఉండాలని.. వ్యతిరేకత రావొద్దని  గైడెన్స్ ఇచ్చిన రాష్ట్ర నాయకత్వం ​

హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్ ఎన్నికల్లో  బీజేపీ 48 మంది కార్పొరేటర్లను గెలుచుకోవడంతో  ఆ పార్టీ ఫుల్​ జోష్​లో ఉంది. దీంతో పార్టీని లోకల్​నుంచి పటిష్టం చేసుకునేందుకు అప్పుడే రాష్ర్ట నాయకత్వం ప్లాన్ చేస్తుంది. గెలిచిన కార్పొరేటర్లు నిత్యం జనంలోనే ఉంటూ వాళ్ల సమస్యలను పరిష్కరించాలని కూడా సూచించింది. వారంలో మూడు రోజులు  ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పార్టీ కార్పొరేటర్లు రెడీ అవుతున్నారు. ప్రమాణం స్వీకారానికి ఇంకా రెండు నెలల టైమ్ ఉన్నా ఇప్పటికే తమ డివిజన్లలో పర్యటిస్తున్నారు.

స్థానికంగా బలపడేందుకు..

బీజేపీ లోకల్​ నుంచి బలపడే విధంగా ప్లాన్ చేస్తోంది. గెలిచిన డివిజన్లలో క్యాడర్ ను  పెంచుకోవ డంతో పాటు కొత్తవాళ్లను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ లో ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లను గెలుచుకునేందుకు ఇప్పటినుంచే మరింత బలపడాలని రాష్ట్ర నాయకత్వం సూచించింది. ఓడిపోయిన చోట్ల కూడా క్యాడర్​ను పెంచుకోవాలని, పోటీ చేసిన క్యాండిడేట్లను ప్రజల్లోనే ఉండాలని ఆదేశించింది. బీజేపీ గెలిచిన, ఓడిపోయిన డివిజన్లలో టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ ఆ పార్టీకి బలమైన క్యాడర్ లేదు. దీంతో కిందిస్థాయి నుంచి కార్యకర్తలు, లీడర్లను తయారు చేసుకునేందుకు ఫోకస్​ చేసింది. అసెంబ్లీ ఎన్నికల నాటికి ప్రతి డివిజన్ లో బీజేపీకి 5 నుంచి 10 వేల మంది క్యాడర్​ ఉండేలా ముందుకెళ్తోంది.

బల్దియాపై పట్టు కోసం

బల్దియాపై పట్టుకోసం బీజేపీ కార్పొరేటర్లు దృష్టి పెట్టారు. బలమైన ప్రతిపక్షంగా ఉంటూ సిటీలోని ప్రధాన సమస్యలపై ఫోకస్​చేసి మీటింగ్​లో ప్రస్తావించాలని నిర్ణయించారు. ఇప్పటికే కార్పొరేటర్లు తమ డివిజన్​లోని సమస్యలు, పెండింగ్​పనుల సమాచార సేకరణలో ఉన్నారు. ఈసారి పార్టీ నుంచి చాలామంది కొత్త వాళ్లు గెలిచారు. డివిజన్లలోని సమస్యలపై ప్రజల్లోకి వెళ్లి అడిగి తెలుసుకుంటున్నారు. ఐదేళ్లలో జరిగిన పనులపై సమాచారం తీసుకుంటున్నారు.

టీఆర్ఎస్ కు చాన్స్ ఇవ్వకుండా.. 

బీజేపీ కార్పొరేటర్లుగా గెలిచిన సీట్లు అన్ని టీఆర్ఎస్ సిట్టింగ్ లవే. వారిపై ఉన్న వ్యతిరేకతే బీజేపీ క్యాండిడేట్లకు కలిసొచ్చింది. ఓడిన టీఆర్ఎస్ క్యాండిడేట్లు కూడా గట్టి పోటీ ఇచ్చిన వారే. దీంతో బీజేపీ కార్పొరేటర్లు అలర్ట్ గా ఉండాలని పార్టీ రాష్ట్ర నేతలు సూచించారు.  ఎట్టి పరిస్థితుల్లో మరోసారి డివిజన్​ కోల్పోవద్దని, వాళ్లు చేసిన తప్పులను చేయవద్దని, తమ డివిజన్లలోని ప్రధాన సమస్యలపై ఫోకస్ పెట్టాలని పార్టీ పెద్దలు చెప్పినట్లు ఓ కార్పొరేటర్ తెలిపారు. ముఖ్యంగా ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించొద్దని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.   బీజేపీ కార్పొరేటర్లపై ఎలాంటి వ్యతిరేక కంప్లయింట్స్ రావొద్దని కూడా గట్టిగానే హెచ్చరించినట్టు చెప్పారు.