కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్ని ప్రమాదం

కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో భారీ అగ్ని ప్రమాదం

అస్సాంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కాచర్ జిల్లాలోని సిల్చార్ పట్టణంలో మే 18వ తేదీ శనివారం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానిక చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడగా.. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై కాచర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నుమల్ మహత్త మాట్లాడుతూ.. " సిల్చార్ పట్టణంలోని షిల్లాంగ్‌పట్టి ప్రాంతంలో బ్యాంక్ ఆఫ్ బరోడా భవనంలోని నాల్గవ అంతస్తులో ఉన్న ఒక కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు అలుముకోవడంతో ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న విద్యార్థులు ప్రాణ భయంతో భవనం పై నుంచి కిందకు దిగేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో ఓ విద్యార్థిని గాయపడింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించింది. ఏడు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు" అని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.