నాణ్యమైన గాలి ఇవ్వలేరా..? అయితే ఎయిర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించండి: ఢిల్లీ హైకోర్ట్

నాణ్యమైన గాలి ఇవ్వలేరా..? అయితే ఎయిర్ ప్యూరిఫైయర్లపై GST తగ్గించండి: ఢిల్లీ హైకోర్ట్

ఢిల్లీలో రోజురోజుకూ దిగజారుతున్న గాలి నాణ్యతపై ప్రజల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. అసలు బయటకు రావాలంటేనే ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు పీల్చుకోవడానికి కనీసం స్వచ్ఛమైన గాలిని కూడా అందించలేనప్పుడు.. ప్రభుత్వాలు ప్రజలకు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కొనుక్కునే ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18 శాతం జీఎస్టీ వసూలు చేయడంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ప్రజలకు స్వచ్ఛమైన గాలిని అందించడం ప్రభుత్వం చేయగలిగిన కనీస పని అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఎయిర్ ప్యూరిఫైయర్లు లగ్జరీ వస్తువు కాదని, వాటిని వెంటనే 'వైద్య పరికరాలు' కేటగిరీలోకి మార్చి జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ విచారణ సమయంలో కోర్టు ఈ కీలక కామెంట్స్ చేసింది. ఢిల్లీ వంటి అత్యంత కాలుష్య నగరాల్లో ప్యూరిఫైయర్లను విలాస వస్తువులుగా చూడటం అస్సలు సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. నగరం ఊపిరాడని స్థితిలో ఉన్నప్పుడు వీటిని లగ్జరీ వస్తువుల జాబితాలో ఎలా ఉంచుతారు? అంటూ ప్రశ్నించింది. 

కోర్టు తన వ్యాఖ్యల్లో ప్రజల ఆరోగ్యంపై కాలుష్య ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. మనం రోజుకు కనీసం 21,000 సార్లు శ్వాస తీసుకుంటాం. అది మన ప్రమేయం లేకుండానే జరుగుతుంది. ఇంత కలుషిత గాలిని ఇన్ని వేల సార్లు పీల్చడం వల్ల ఊపిరితిత్తులకు జరుగుతున్న నష్టాన్ని ఒక్కసారి ఊహించండి అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ప్రజలకు గాలిని ఫ్యూరిఫై చేసుకునే పరికరాలు ఎంత అవసరమో సూచించింది కోర్ట్.

ALSO READ : ముంబై రాజకీయం : 20 ఏళ్ల తర్వాత ఒక్కటైన థాకరే బ్రదర్స్..

ప్రస్తుత కాలుష్య పరిస్థితులను ఎమర్జెన్సీగా చూడాలని కోర్టు కోరింది. కనీసం వచ్చే వారం లేదా నెల రోజుల పాటు తాత్కాలికంగానైనా జీఎస్టీ నుంచి ఎయిర్ ఫ్యూరిఫయర్లను మినహాయించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు జీఎస్టీ కౌన్సిల్ ను ఆదేశించింది న్యాయస్థానం. దీనిపై తదుపరి విచారణలోగా స్పష్టమైన ఆదేశాలు తీసుకుని రావాలని అధికారులకు సూచించింది.

ప్రస్తుతం ఎయిర్ ప్యూరిఫైయర్ల ధరలు మార్కెట్లో వేలల్లో ఉన్నాయి. దానిపై 18% జీఎస్టీ వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలు వీటిని కొనలేకపోతున్నారు. కోర్టు తీర్పు సానుకూలంగా వస్తే.. ధరలు తగ్గి వేలాది మందికి ఢిల్లీ వాసులకు లబ్ధి చేకూరడమే కాకుండా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వృద్ధులకు, చిన్నపిల్లలకు పెద్ద ఊరట లభించనుంది.