డబ్బుంటే ఏమైనా చేయొచ్చు.. డబ్బుంటే ఎలాగైనా చేయొచ్చు.. డబ్బుంటే ఏం చేసినా చెల్లుతుంది.. ఇదేనా వాడి పొగరు.. అహంకారం.. 12 కోట్ల రూపాయల విలువైన కారు.. ఆ కారు నడుపుతున్నది పొగాకు వ్యాపారవేత్త కుమారుడు.. రోడ్డెక్కి ఎంత జాగ్రత్తగా వెళ్లాలి.. అబ్బే స్పీడ్.. ఓవర్ స్పీడ్.. 12 కోట్ల రూపాయల కారు కదా.. ఆ మాత్రం స్పీడ్ ఉంటుంది.. అదే స్థాయిలో బ్యాలెన్స్ చేసుకోవాలి కదా.. అబ్బే అదేం లేదు.. కన్నూమిన్నూ ఆడకుండా ఇష్టమొచ్చినట్లు డ్రైవింగ్ చేశాడు.. రోడ్డుపై కార్లు, బైక్స్ ఢీకొంటూ వెళ్లాడు.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.. ఇండియాలో సంచలనంగా మారిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రూ.12 కోట్ల ఖరీదైన లంబోర్గిని కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్తో దూసుకెళ్లి రోడ్డుపై ఆటో, బైక్ను ఢీకొట్టి పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు గాయపడ్డారు. బైక్ పై ఉన్న ఓ వ్యక్తి 10 మీటర్ల దూరం ఎగిరిపడ్డాడు. 2026, ఫిబ్రవరి 8వ తేదీ మధ్యాహ్నం రెవ్-3 మాల్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
ప్రమాదానికి కారణమైన లంబోర్గిని కారు నడిపిన వ్యక్తిని బిలియనీర్, పొగాకు వ్యాపారవేత్త కెకె మిశ్రా కుమారుడు శివం మిశ్రాగా పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు శివం మిశ్రాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రమాద సమయంలో శివమ్ మిశ్రా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. ఈ కేసు నుంచి శివం మిశ్రాను తప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారని బాధితులు స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
ఎఫ్ఐఆర్లో మొదట గుర్తు తెలియని వ్యక్తి కారు నడిపినట్లుగా పోలీసులు పేర్కొన్నారని బాధితులు ఆరోపించారు. ఇష్యూ పెద్దకావడంతో పోలీసులు చేసేదేం లేక శివం మిశ్రా పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ప్రమాద సమయంలో శివం మిశ్రాను కాపాడేందుకు అతని బౌన్సర్లు కూడా ప్రయత్నించారు. లంబోర్గిని వెంట మరో కారులో వచ్చి స్థానికులతో వాగ్వాదానికి దిగారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన స్థానికులు లంబోర్గిని కారు అద్ధాలు పగలగొట్టి శివం మిశ్రాను బయటకు లాగారు.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు శివం మిశ్రాను, కారును అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మిశ్రా ఫ్యామిలీ స్పందించింది. శివం మిశ్రా కొన్నాళ్ల నుంచి ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. డ్రైవింగ్ సమయంలో ఫిట్స్ రావటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
