- మూడో క్వార్టర్లో రూ.2.73 కోట్ల లాభం
- మొత్తం ఆదాయం రూ.366.98 కోట్లు
హైదరాబాద్, వెలుగు: విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ 2026 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్లో అద్భుతమైన పనితీరు కనబరిచింది. డిసెంబరుతో ముగిసిన క్వార్టర్లో కంపెనీకి రూ.2.73 కోట్ల నికర లాభం వచ్చింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.10.30 కోట్ల నష్టం ఉండేది. ఆపరేషనల్ ఇన్కమ్ రూ.366.98 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే క్వార్టర్ లో ఆదాయం రూ.350.96 కోట్లుగా ఉంది. పన్నుకు ముందు లాభం (పీబీటీ) రూ.3.78 కోట్లుగా నమోదైంది.
గత ఏడాది మూడో క్వార్టర్ లో రూ.13.50 కోట్ల భారీ నష్టం ఉండగా, ఇప్పుడు లాభాల్లోకి రావడం విశేషం. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలానికి కంపెనీ ఆదాయం రూ.1196.15 కోట్లకు చేరింది. ఈ కాలంలో పీబీటీ రూ.58.15 కోట్లుగా ఉంది. ఇందులో అహ్మదాబాద్ లోని భూమి విక్రయం ద్వారా వచ్చిన రూ.36.74 కోట్ల అసాధారణ లాభం కూడా ఉంది.
ఈ తొమ్మిది నెలల కాలంలో నికర లాభం రూ.46.91 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే తొమ్మిది నెలల కాలంలో రూ.15.89 కోట్ల నష్టం ఉండేది. ఖర్చులను అదుపు చేస్తూ ఆదాయం పెంచుకోవడంతో కంపెనీ లాభాల బాట పట్టింది.
