అహ్మదాబాద్: గత టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా తాజా టోర్నీని ఘన విజయంతో షురూ చేసింది. కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ (32 బాల్స్‌లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) ఫిఫ్టీకి పేసర్ లుంగి ఎంగిడి (4/31) విజృంభించడంతో చిన్న జట్టు కెనడాపై పంజా విసిరింది.
సోమవారం జరిగిన గ్రూప్–డి మ్యాచ్‌లో 57 రన్స్ తేడాతో కెనడాను చిత్తు చేసింది. ఏకపక్ష మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 213/4 స్కోరు చేసింది. స్టార్టింగ్ నుంచే అదరగొట్టిన మార్‌క్రమ్ మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (25)తో కలిసి తొలి వికెట్‌కు 70 రన్స్ జోడించి గట్టి పునాది వేశాడు.
ఈ క్రమంలో 28 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నఅతను వన్‌డౌన్‌లో వచ్చిన ర్యాన్ రికెల్టన్ (31)తో రెండో వికెట్‌కు 56 రన్స్ జోడించాడు.
రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్ (6)ఒకే ఓవర్లో ఔటైనా.. చివర్లో వెటరన్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (23 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 39 నాటౌట్), యంగ్‌స్టర్ ట్రిస్టన్ స్టబ్స్ (19 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 నాటౌట్) భారీ షాట్లు కొట్టడంతో సఫారీలు ఈజీగా 200 మార్కు దాటారు. కెనడా బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ అన్ష్ పటేల్(3/ 31) 3 వికెట్లు పడగొట్టాడు.
నవనీత్ ధలివాల్ పోరాడినా..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో నవనీత్ ధలివాల్ ఫిఫ్టీతో ఒంటరి పోరాటం చేసినా కెనడా ఓవర్లన్నీ ఆడి 156/8 స్కోరు చేసి ఓడిపోయింది. సఫారీ పేసర్ లుంగి ఎంగిడి కొత్త బాల్‌తో వరుస వికెట్లతో కెనడా టాపార్డర్ నడ్డి విరిచాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్‌కే కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా (0)ను గోల్డెన్ డకౌట్ చేసిన అతను మూడో ఓవర్లో యువరాజ్ సమ్రా (12), నికోలస్ కిర్టన్ (4)ను పెవిలియన్ చేర్చగా.. శ్రేయస్ మొవ్వా (9)ను రబాడ బౌల్డ్ చేయడంతో కెనడా 45/4తో ఎదురీత మొదలు పెట్టింది.
ఈ టైమ్‌లో ధలివాల్, హర్ష థాకర్ (33)తో ఐదో వికెట్‌కు 69 రన్స్ జోడించి సఫారీ బౌలర్లకు ఎదురునిలిచాడు. ఎంగిడి బౌలింగ్‌లో హర్ష్ వెనుదిరగ్గా.. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న ధలివాల్ చివరి ఓవర్లో ఔటయ్యాడు. యాన్సెన్ రెండు వికెట్లు తీయగా.. ఎంగిడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
