హెయిర్ కటింగ్ వివాదం: రూ. 2 కోట్ల పరిహారానికి రూ.25 లక్షలు విధించిన సుప్రీంకోర్టు!

హెయిర్ కటింగ్ వివాదం: రూ. 2 కోట్ల పరిహారానికి రూ.25 లక్షలు విధించిన సుప్రీంకోర్టు!

లగ్జరీ హోటల్ సెలూన్‌లో హెయిర్ కట్ సరిగ్గా చేయలేదని ఫిర్యాదు చేసిన మహిళకు ఇచ్చే పరిహారాన్ని సుప్రీంకోర్టు తగ్గించింది. సరైన ఆధారాలు లేకుండా కేవలం అంచనాలతో భారీ మొత్తంలో నష్టపరిహారం ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు వివరాలు చూస్తే  2018లో ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్ సెలూన్‌లో ఆష్నా రాయ్ అనే మహిళ హెయిర్ కట్ చేయించుకున్నారు. జుట్టును సరిగా కట్ చేయకుండా తప్పుగా కట్ చేసారని, దీనివల్ల ఆమె మోడలింగ్ కెరీర్ దెబ్బతిందని, మానసిక వేదనకు గురయ్యానని ఆమె వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.

దింతో జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) ఆమెకు రూ. 2 కోట్లు పరిహారం చెల్లించాలని గతంలో తీర్పునిచ్చింది. హోటల్ యాజమాన్యం వేసిన అప్పీల్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రూ. 2 కోట్ల పరిహారాన్ని కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. 

మోడలింగ్ అవకాశాలు పోయాయని ఆమె చెప్పిన మాటలకు సరైన సాక్ష్యాలు లేవు. ఆమె సమర్పించిన డాకుమెంట్స్ కేవలం జెరాక్స్ మాత్రమే, అవి కూడా స్పష్టంగా లేవు. హెయిర్ కట్ తర్వాత ఉద్యోగం పోయిందని ఆమె వాదించినా, అప్పుడు ఆమెకు వచ్చిన జీతం స్లిప్పులు కరెక్టుగా లేవు. అంటే ఆమెకు ఆర్థిక నష్టం జరిగిందని నిరూపించడానికి బలమైన ఆధారాలు లేవు.

కొన్ని మోడలింగ్ సర్టిఫికెట్లు లెటర్ హెడ్ లేకుండా ఒక కాగితంపై ఉన్నాయి. ఒక సినిమాలో అవకాశం వచ్చిందని ఆమె చెప్పిన మాటలు, ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDB) రికార్డులతో మ్యాచ్ కాలేదు. హోటల్ తరపు లాయర్లు ఆమెను ప్రశ్నించడానికి కమిషన్ అవకాశం ఇవ్వలేదని కోర్టు గుర్తించింది.

చివరికి  కమిషన్ ప్రకటించిన రూ. 2 కోట్లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆమెకు ఇప్పటికే అందిన రూ. 25 లక్షలను మాత్రమే పరిహారంగా ఫైనల్ చేసింది. అంటే దాదాపు 87.5 శాతం పరిహారాన్ని తగ్గించింది. వినియోగదారుల సేవలో లోపం ఉన్న మాట వాస్తవమే అయినా, నష్టపరిహారం అనేది బాధితురాలు కోరినంత లేదా ఊహించినంత ఇవ్వలేము. అది కచ్చితంగా జరిగిన నష్టానికి తగిన ఆధారాలతో నిరూపించాలి అని జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం తీర్పునిచ్చింది.