కుర్రోడు.. యంగ్.. 22 ఏళ్లు.. పేరు మహ్మద్ కైఫ్.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లో ఉంటాడు.. ఎంతో యాక్టివ్.. చురుగ్గా ఉంటాడు.. ఎంత యాక్టివ్ అంటే.. సెల్ ఫోన్ పట్టుకున్నాడంటే PUB G గేమ్ ఇట్టే ఆడేస్తాడు.. గెలిచే వరకు ఫోన్ వదలడు.. అలాంటి కుర్రోడికి బీపీ.. బ్లడ్ ప్రెజర్ 300 వచ్చింది.. హై బీపీతో నరాలు చిట్లిపోయాయి.. ఆ తర్వాత చనిపోయాడు.. కారణం.. సెల్ ఫోన్లో పబ్జీ గేమ్ ఆడటమే..
అవును.. ఈ గేమ్ వల్ల బీపీ పెరిగి.. నరాలు చిట్లి చనిపోయాడు అనేది ఇప్పడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మొన్నటికి మొన్న యూపీలో ముగ్గురు అక్కా చెళ్లళ్లు కొరియన్ గేమ్ ఆడుతూ.. కొరియన్‌లా మారాలనే ఆలోచన నెరవేరకపోవటంతో.. ఆత్మహత్య ఘటన మర్చిపోక ముందే.. మీరట్‌లో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మీరట్‌లోని ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఖేర్ నగర్‌లో నివసిస్తున్న 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ పబ్జీ గేమ్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందాడు. పబ్జీ గేమ్ ఒత్తిడితో బీపీ ఆకస్మాత్తుగా పెరిగి రక్త నాళాలు చిట్లిపోయి కైఫ్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
కైఫ్ రెండు చెవుల్లో హెడ్‌ఫోన్‌లు పెట్టుకుని గేమ్ ఆడుతుండగా ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లామని.. కండిషన్ సీరియస్‌గా ఉండటంతో అక్కడి నుంచి ఢిల్లీలోని హోప్ నర్సింగ్ హోమ్‌కు తరలించామని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడని వెల్లడించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కైఫ్ తండ్రి ఫరూఖ్ మాట్లాడుతూ.. తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు బీపీ 300 కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. తీవ్ర ఒత్తిడితో బీపీ పెరిగి మెదడులో రక్తస్రావమై మెడ నరాలు చిట్లిపోవడం వల్లే మరణించినట్లు వైద్యులు చెప్పారని అన్నారు.
కైఫ్ గత పది సంవత్సరాల నుంచి హై బీపీతో బాధపడుతున్నాడని.. దీని కోసం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే పబ్జీ గేమ్ ఒత్తిడితో బీపీ మరింత పెరిగి చివరకు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్జీ గేమ్ ఒత్తిడికి 22 ఏళ్ల యువకుడు బలి కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
