మార్కెట్లకు డీల్ జోష్..సెన్సెక్స్ 485 పాయింట్లు జంప్..173 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

మార్కెట్లకు డీల్ జోష్..సెన్సెక్స్ 485 పాయింట్లు జంప్..173 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ

ముంబై:  ఇండియా, అమెరికా  మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం దేశీయ స్టాక్ మార్కెట్లలో   ఉత్సాహాన్ని నింపింది.  సెన్సెక్స్ 485.35 పాయింట్లు పెరిగి 84,065.75 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 734.28 పాయింట్లు పెరిగి 84,314.68 గరిష్ట స్థాయిని తాకింది.  ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 173.60 పాయింట్లు లాభపడి 25,867.30 వద్ద సెటిలయింది. నిఫ్టీ కూడా ట్రేడింగ్ సమయంలో 228.55 పాయింట్ల లాభంతో 25,922.25 పాయింట్ల గరిష్టాన్ని చేరుకుంది. 

ప్రభుత్వ రంగ బ్యాంకులు అంచనాల కంటే మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించడం మార్కెట్​కు ప్రధాన బలంగా మారింది. ఎస్​బీఐ అద్భుతమైన లాభాలను సాధించడంతో పీఎస్​యూ బ్యాంక్ ఇండెక్స్ 2.83 శాతం మేర పెరిగి టాప్​లో నిలిచింది. వీటితో పాటు టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీ లాభాలను సంపాదించాయి.  ఎఫ్​ఐఐలు రూ.1,950.77 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. 

రంగాల వారీగా చూస్తే, రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, ఫార్మా రంగాలు రాణించాయి.  ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ, దక్షిణ కొరియా కోస్పీ, హాంగ్ సెంగ్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ చమురు ధర బ్రెంట్ క్రూడ్ 0.81 శాతం తగ్గి బ్యారెల్ కు 67.52 డాలర్లకు చేరుకోవడం దేశీయ మార్కెట్ కు కలిసివచ్చింది.  బీఎస్​ఈ లో మొత్తం 3,110 షేర్లు లాభాల్లో ముగియగా, 1,254 షేర్లు మాత్రమే నష్టపోయాయి.