పులి కోసం..పుణె టీమ్!..సిద్దిపేట, జనగామ, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో ముమ్మర గాలింపు : అటవీశాఖ

పులి కోసం..పుణె టీమ్!..సిద్దిపేట, జనగామ, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో ముమ్మర గాలింపు : అటవీశాఖ
  •     తాజాగా సిద్దిపేట జిల్లా ఆరేపల్లిలో పెద్దపులి పాదముద్రలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలను వణికిస్తున్న పెద్దపులిని పట్టుకోవడానికి పుణె టీమ్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఆరేపల్లి గ్రామ పరిసరాల్లో పులి మకాం వేసినట్టు అటవీశాఖ నిర్ధారించింది. ఆ పులి ఆరేపల్లి నుంచి ఉత్తరదిశగా కదులుతున్నట్టు ట్రాకింగ్ బృందాలు గుర్తించాయి. ఈ క్రమంలో ప్రజలకు, పులికి ఎలాంటి హాని జరగకుండా అటవీశాఖ చర్యలు చేపట్టింది. అయితే, పుణె నుంచి వచ్చిన ప్రత్యేక టైగర్ రెస్క్యూ నిపుణులు, స్థానిక వెటర్నరీ డాక్టర్లతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 

సిద్దిపేట, జనగామ, కరీంనగర్, యాదాద్రి జిల్లాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో సోమవారం పులి కదలికలపై పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 6, 7 తేదీల్లోనే పులి అడుగుజాడలను అధికారులు గుర్తించారు. కొన్నిచోట్ల ప్రత్యక్షంగా కనిపించినట్టు కూడా రికార్డయ్యింది.

పులి కనిపిస్తే సమాచారం ఇవ్వండి

ఇప్పటివరకు పులి దాడిలో సుమారు 8 పశువులు మృత్యువాత పడ్డాయి. బాధితులకు పరిహారం అందిస్తామని పీసీసీఎఫ్ ​సువర్ణ హామీ ఇచ్చారు. శానిగరం, కోహెడ మండలాలు, ఆరేపల్లి చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాత్రి వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, పొలాలకు వెళ్లేవారు ఒంటరిగా కాకుండా, గుంపులుగా వెళ్లాలని సూచించారు. పులి కనిపిస్తే వెంటనే అటవీ లేదా పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.