హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో ఉండగా ప్రమాదవశాత్తు మృతి చెందిన హోంగార్డు(1522) ఎం వెంకటేశ్ కుటుంబానికి పోలీస్ శాఖ రూ.34 లక్షల పరిహారం అందించింది. ఈ మేరకు వెంకటేశ్ భార్య కొడిగంటి స్వాతికి అడిషనల్ డీజీపీ(హోంగార్డ్స్) స్వాతి లక్రా సోమవారం బ్యాంక్ చెక్కును అందించారు. కాగా, రాచకొండ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా విధులు నిర్వహించే వెంకటేశ్.. గతేడాది ఏప్రిల్ 27న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
హోంగార్డు విభాగంతో యాక్సిస్ బ్యాంక్ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, సాలరీ అకౌంట్ కలిగిన సిబ్బందికి ప్రమాద బీమా కింద ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఏడీజీ స్వాతిలక్రా తెలిపారు. మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి పోలీసు శాఖ తరపున ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
