నేతలు హామీ ఇచ్చారని పిటిషన్ వేస్తే ఎలా? : హైకోర్టు

నేతలు హామీ ఇచ్చారని పిటిషన్ వేస్తే ఎలా? : హైకోర్టు
  •     ఉద్యమం చేశారని పెన్షన్, ఇంటి స్థలం ఇవ్వాలని అడగలేరు
  •     ఆ మేరకు ప్రభుత్వానికి ఆదేశాలుజారీ చేయలేం: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి పెన్షన్,  ఇంటి స్థలం వంటి ప్రయోజనాలు ఇవ్వాలంటే ప్రభుత్వం ఆ మేరకు జీఓ జారీ చేసి ఉండాలని హైకోర్టు గుర్తుచేసింది. విధానపర నిర్ణయం ప్రభుత్వ విచక్షణ మేరకే ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చారని చెప్పి పిటిషన్‌  దాఖలు చేస్తే ఎలాగని పిటిషనర్‌ను ప్రశ్నించింది. పిటిషనర్‌  కోరిన మేరకు తాము ఉత్తర్వులను జారీ చేస్తే తేనే తుట్టెను కదిపినట్లు అవుతుందని అభిప్రాయపడింది. దీనిపై ఎలాంటి ప్రభుత్వ విధానం లేదని, కాబట్టి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని వెల్లడించింది. ఈ వ్యవహారానికి సంబంధించి కలెక్టర్‌  రాసిన లేఖలపై ప్రభుత్వ వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి స్థలం, పెన్షన్‌  మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌  సిటీకి చెందిన జి.నాగరాజు మరో 8 మంది వేసిన పిటిషన్‌ను జస్టిస్‌  బి.విజయ్‌సేన్‌ రెడ్డి సోమవారం విచారించారు. పిటిషనర్‌  తరపు న్యాయవాది కరుణాకర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమంలో పాల్గొన్న వారికి పెన్షన్‌, ఇంటి స్థలం ఇస్తామని అధికార పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిందన్నారు. ఈ కేటగిరిలో 250 చదరపు గజాల స్థలాన్ని జర్నలిస్టు పాశం యాదగిరికి, మరొకరికి ప్రభుత్వం ఇచ్చిందని, అయితే వాటి జీఓలు బయటకు రాలేదన్నారు. 

వాదనలపై స్పందించిన విన్న న్యాయమూర్తి.. బ్రిటిష్‌  పాలకులు, నిజాం పాలకులకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్రం కోసం పోరాడితే పెన్షన్‌  ఇచ్చేందుకు ప్రభుత్వ జీఓలు ఉన్నాయని, తెలంగాణ కోసం పోరాడిన వాళ్లు స్వాతంత్య్ర సమరయోధులతో సమానంగా తమకు కూడా పెన్షన్, ఇంటి జాగా ఇవ్వాలని ఎలా కోరుతారని ప్రశ్నించారు. దేశంలోనే ఉంటూ  రాష్ట్ర సాధనలో పాల్గొన్నవారికి కూడా ఇవ్వాలని కోరడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. విచారణను  ఈనెల 23వ తేదీకి వాయిదా వేశారు.