దుమ్మురేపిన ప్రభుత్వరంగ బ్యాంకులు..మూడో క్వార్టర్లో రూ.52వేల603 కోట్ల లాభం

దుమ్మురేపిన ప్రభుత్వరంగ బ్యాంకులు..మూడో క్వార్టర్లో రూ.52వేల603 కోట్ల లాభం
  • గత ఏడాదితో పోలిస్తే 18 శాతం జంప్​
  • ఎస్​బీఐ వాటాయే 40 శాతం

న్యూఢిల్లీ: మనదేశంలో అతిపెద్ద బ్యాంక్ ఎస్​బీఐ నేతృత్వంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్​బీలు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ క్వార్టర్ లో రూ.52,603 కోట్ల రికార్డు స్థాయి ఉమ్మడి లాభాన్ని సాధించాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువ. 2025 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్ లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.44,473 కోట్ల లాభం వచ్చింది.

గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్ తో పోలిస్తే లాభం రూ.8,130 కోట్లు పెరిగింది. స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఇవి అందించిన లెక్కల ప్రకారం.. మొత్తం ఆదాయంలో మార్కెట్ టాపర్​ ఎస్​బీఐ వాటా 40 శాతంగా ఉంది. 2026 ఆర్థిక సంవత్సరం మూడవ క్వార్టర్ లో ఎస్​బీఐ రూ.21,028 కోట్ల అత్యధిక క్వార్టర్ నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలం కంటే 24 శాతం ఎక్కువ.

అదరగొట్టిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్

శాతాల పరంగా చూస్తే చెన్నైకి చెందిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 56 శాతం వృద్ధితో రూ.1,365 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 32 శాతం వృద్ధితో రూ.1,263 కోట్లు సాధించింది. ఈ క్వార్టర్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మినహా మిగిలిన బ్యాంకులు సింగిల్​డిజిట్ ​గ్రోత్​ను సాధించాయి.

ఎస్​బీఐ కాకుండా 20 శాతం కంటే ఎక్కువ లాభం సాధించిన వాటిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (27 శాతం వృద్ధి), కెనరా బ్యాంక్ (26 శాతం వృద్ధి) ఉన్నాయి. రెండంకెల వృద్ధి సాధించిన ఇతర బ్యాంకుల్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 19 శాతం, యూకో బ్యాంక్ 16 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్​బీ) 13 శాతం లాభాలను పొందాయి.

రెండో క్వార్టర్ లో రూ.49,456 కోట్ల లాభం

ఏడాది ప్రాతిపదికన 2025 ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్ లో ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.49,456 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. 2025 డిసెంబర్ తో ముగిసిన తొమ్మిది నెలల కాలానికి ఈ బ్యాంకుల ఉమ్మడి లాభం మొదటిసారిగా రూ.1.45 లక్షల కోట్లు దాటింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుతం రూ.1.46 లక్షల కోట్లు ఆర్జించి 13 శాతం వృద్ధి సాధించాయి.

ఈ విషయమై ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ఉమ్మడి లాభం రూ.రెండు లక్షల కోట్లు దాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. దేశ బ్యాంకింగ్ రంగం మెరుగైన స్థితిలో ఉందని, రుణ వృద్ధి 12 శాతంగా, డిపాజిట్ల వృద్ధి 10 శాతంగా ఉందని తెలిపారు. ఆర్​బీఐ పర్యవేక్షణలో పటిష్టమైన నిర్వహణ వ్యవస్థలు ఉన్నాయని నాగరాజు స్పష్టం చేశారు.