కోకాకోలాలో లేఆఫ్స్‌.. బాట్లింగ్ యూనిట్‌లో 300 మంది ఉద్యోగులు ఔట్..

కోకాకోలాలో లేఆఫ్స్‌.. బాట్లింగ్ యూనిట్‌లో 300 మంది ఉద్యోగులు ఔట్..

ప్రముఖ సాఫ్ట్ డ్రింక్స్ తయారీ సంస్థ కోకాకోలాకు చెందిన బాట్లింగ్ విభాగం.. హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ తన వ్యాపార కార్యకలాపాలను రీస్ట్రక్చరింగ్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 300 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. కంపెనీ లాభాలను మెరుగుపరచుకోవడానికి, మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పనితీరును మెరుగుపరచుకోవడానికి ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం HCCBలో సుమారు 5వేల మంది ఉద్యోగులు ఉండగా, తాజా లేఆఫ్స్ వల్ల మొత్తం సిబ్బందిలో దాదాపు 4 నుంచి 6 శాతం మందిపై ప్రభావం పడనుంది.

ఈ లేఆఫ్స్ కేవలం ఒక్క విభాగానికి మాత్రమే పరిమితం కాకుండా.. సేల్స్, సప్లై చైన్, పంపిణీ, బాట్లింగ్ ప్లాంట్లలోని వివిధ విభాగాల్లో ఉండనున్నాయి. దీనిపై కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ.. వ్యాపార అవసరాలకు అనుగుణంగా నిర్వహించే సాధారణ సమీక్షలో భాగంగానే ఈ మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి, సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి అప్పుడప్పుడు ఇటువంటి చర్యలు తప్పవని అన్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల కంపెనీ రోజువారీ ప్రొడక్షన్ లేదా సప్లైపై ఎలాంటి ప్రభావం ఉండదని వెల్లడించారు.

కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం లాభాల్లో కనిపిస్తున్న భారీ క్షీణతే. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం ఏకంగా 73 శాతం తగ్గి రూ.756 కోట్ల64లక్షలుగా నమోదైంది. అలాగే ఆపరేషన్స్ ద్వారా వచ్చే ఆదాయం కూడా 9 శాతం తగ్గి రూ.12వేల751 కోట్లకు చేరుకుంది. రాజస్థాన్, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి కీలక ప్రాంతాల్లోని తన బాట్లింగ్ యూనిట్లను ఫ్రాంచైజీ భాగస్వాములకు విక్రయించడం కూడా ఆదాయంలో మార్పులకు ఒక కారణంగా కనిపిస్తోంది. గూగుల్, అమెజాన్ వంటి టెక్ సంస్థల బాటలోనే ఇప్పుడు అమెరికాకు చెందిన FMCG రంగానికి చెందిన కోకాకోలా కూడా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడటం ఆందోళనలు కలిగిస్తోంది. 

ALSO READ : లక్ష డాలర్ల వీసా ఫీజుకు యూఎస్ కోర్టు గ్రీన్ సిగ్నల్..

మరోవైపు వాతావరణ పరిస్థితులు కూడా కంపెనీ లాభాలను దెబ్బతీశాయి. సాధారణంగా మార్చి నుండి సెప్టెంబర్ వరకు ఉండే వేసవి కాలం సాఫ్ట్ డ్రింక్స్‌కు అత్యంత కీలకమైన సమయం. అయితే గతేడాది అకాల భారీ వర్షాలతో కూల్ డ్రింక్స్ డిమాండ్ ఆశించిన స్థాయిలో లేదు. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమ్మకాలు మందగించడం కంపెనీపై ఒత్తిడిని పెంచింది. జూలైలో కొత్త సీఈఓగా హేమంత్ రూపానీ బాధ్యతలు చేపట్టిన తర్వాత.. కంపెనీ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు చేపడుతున్న ప్రస్తుత ప్రయత్నాలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.