లక్ష డాలర్ల వీసా ఫీజుకు యూఎస్ కోర్టు గ్రీన్ సిగ్నల్.. భారత ఐటీ కంపెనీలకు కష్టకాలమేనా..?

లక్ష డాలర్ల వీసా ఫీజుకు యూఎస్ కోర్టు గ్రీన్ సిగ్నల్.. భారత ఐటీ కంపెనీలకు కష్టకాలమేనా..?

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా ఇండియన్ టెక్కీలకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. H-1B వీసా దరఖాస్తులపై ట్రంప్ సర్కార్ ప్రకటించిన లక్ష డాలర్ల భారీ రుసుము అమలుకు అమెరికా ఫెడరల్ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి బెరిల్ హోవెల్ అమెరికా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించటం చాలా మందికి నిద్ర లేకుండా చేస్తోంది. 

యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ వంటి సంస్థలు భారీ వీసా ఫీజు పెంచే అధికారం అధ్యక్షుడికి లేదని వాదించాయి. అయితే జడ్జి బెరిల్ హోవెల్ ఈ వాదనను తోసిపుచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి కల్పించిన విస్తృత చట్టబద్ధమైన అధికారాల పరిధిలోనే ఈ నిర్ణయం ఉందని ఆమె స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రత దృష్ట్యా.. అధ్యక్షుడు ట్రంప్ తగిన నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగి ఉంటారని యూఎస్ కోర్టు కూడా స్పష్టం చేసింది.

టెక్కీలకు, కంపెనీలకు భారం:
ప్రస్తుతం విదేశీ నైపుణ్యంపై ఆధారపడే అమెరికన్ టెక్ కంపెనీలకు ఈ తీర్పు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. లక్ష డాలర్ల ఫీజు అనేది వీసా ప్రక్రియను అత్యంత ఖరీదైనదిగా మారుస్తుంది. దీనివల్ల చిన్న, మధ్యతరహా కంపెనీలు విదేశీయులను నియమించుకోవడం దాదాపు అసాధ్యం అవనుంది.

ALSO READ : గూగుల్ టెక్కీలకు గుడ్ న్యూస్

నిరాశలో భారత ఐటీ రంగం:
భారతీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఏటా వేల సంఖ్యలో హెచ్-1బి వీసాల కోసం దరఖాస్తు చేస్తాయి. కొత్త ఫీజు నిబంధన వల్ల ఈ కంపెనీలపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతుంది. ఇది కేవలం కంపెనీలకే కాకుండా.. అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయ యువత కలలపై కూడా నీళ్లు చల్లినట్లు అయ్యింది. అయితే ఈ తీర్పుపై పైకోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉన్నందున, చాంబర్ ఆఫ్ కామర్స్ తర్వాతి లీగల్ బ్యాటిల్ కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు హెచ్1బి లాటరీ విధానానికి కూడా అమెరికా స్వస్థి పలకటంతో పరిస్థితులు పూర్తిగా విదేశీ టెక్కీలకు ప్రతికూలంగా మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.