గూగుల్ టెక్కీలకు గుడ్ న్యూస్: మళ్లీ US గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ స్టార్ట్..

గూగుల్ టెక్కీలకు గుడ్ న్యూస్: మళ్లీ US గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ స్టార్ట్..

అమెరికాలో స్థిరపడాలనుకునే వేలాది మంది టెక్ నిపుణులకు, ముఖ్యంగా భారతీయులకు గూగుల్ సంస్థ తీపి కబురు అందించింది. గత రెండేళ్లుగా నిలిపివేసిన గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను మళ్లీ పట్టాలెక్కించనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల H-1B వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులకు అమెరికాలో పర్మనెంట్ రెసిడెన్స్ పొందటానికి మార్గం సుగమం కానుంది.

2026 మొదటి త్రైమాసికం నుండి 'ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్‌మెంట్' (PERM) ప్రక్రియను తిరిగి ప్రారంభించనున్నట్లు గూగుల్ తన అంతర్గత మెమోలో ఉద్యోగులకు వెల్లడించింది. గ్రీన్ కార్డ్ పొందడానికి ఇది మొదటి అలాగే అత్యంత కీలకమైన దశ. 2023లో జరిగిన భారీ లేఆఫ్స్ కారణంగా గూగుల్ దీనిని నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ దీనిని స్పీడప్ చేయాలని ప్లాన్ చేయటం ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.

ఎవరు అర్హులు?
గూగుల్‌లో పనిచేసే ప్రతి విదేశీ ఉద్యోగికి ఈ అవకాశం దక్కదని టెక్ దిగ్గజం తేల్చి చెప్పేసింది. కంపెనీ కొన్ని కఠినమైన నిబంధనలను స్పాన్సర్‌షిప్ కోసం విధించింది. వార్షిక సమీక్షల్లో అభ్యర్థికి కనీసం 'మోడరేట్ ఇంపాక్ట్'లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉద్యోగి కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే లెవల్ 3 లేదా అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు స్పాన్సర్‌షిప్ లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోం విధానంలో పనిచేసే వారికి ఈ అవకాశం ఉండదు. గ్రీన్ కార్డ్‌కు అర్హత పొందాలంటే వారు తప్పనిసరిగా వర్క్ ఫ్రమ్ ఆఫీసుకు మారాల్సి ఉంటుంది. అలాగే దీనికి విద్యార్హతలు, గత పని అనుభవం కూడా తప్పనిసరి అని గూగుల్ స్పష్టం చేసింది.

గ్రీన్ కార్డ్ వల్ల ప్రయోజనాలు:
గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు గ్రీన్ కార్డ్ స్పాన్సర్ చేయడం వల్ల ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.

1. వర్క్ వీసాల గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదు. అమెరికాలో శాశ్వతంగా నివసించే హక్కు లభిస్తుంది.
2. హెచ్-1బి వీసాపై ఉన్నప్పుడు ఉద్యోగం మారడం చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ గ్రీన్ కార్డ్ వస్తే.. ఏ కంపెనీలోనైనా పనిచేసే స్వేచ్ఛ లభిస్తుంది.
3. ఉద్యోగిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు (భార్య/భర్త, పిల్లలు) కూడా పర్మనెంట్ రెసిడెన్సీ పొందుతారు. దీంతో వారి పిల్లల విద్య, భవిష్యత్తుకు భరోసా దొరుకుతుంది.
4. అమెరికా ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను పొందటానికి గ్రీన్ కార్డ్ వీలు కల్పిస్తుంది.