టాలీవుడ్ నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల సెగ ఇప్పుడు 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్' (MAA) గడప తొక్కింది. హీరోయిన్ల వస్త్రధారణపై శివాజీ వాడిన పదజాలం పట్ల టాలీవుడ్‌లోని మహిళా లోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లేటెస్ట్ గా 'వాయిస్ ఆఫ్ ఉమెన్' (Voice of Women) బృందం మా (MAA) అధ్యక్షుడు మంచు విష్ణుకు ఒక బహిరంగ లేఖ రాసింది. శివాజీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
శివాజీపై 'మా' కు ఘాటు లేఖ!
టాలీవుడ్ లో పనిచేస్తున్న దాదాపు 100 మందికి పైగా మహిళా నిపుణుల తరుపున దర్శకురాలు నందినీ రెడ్డి, సుప్రియ యార్లగడ్డ, స్వప్న దత్, మంచు లక్ష్మి, ఝాన్సీ లక్ష్మి , ఇతరులు కలిసి 'వాయిస్ ఆఫ్ ఉమెన్' పేరుతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడికి లేఖ రాశారు. శివాజీ మాటలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు కావని, అవి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమ ద్వారా లబ్ధి పొందుతూ.. సమాజంపై ప్రభావం చూపే వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు ఆమోదయోగ్యం కాదని మండిపడ్డారు.
తీవ్ర అభ్యంతరకర పదాజాలం..
'దండోరా' ప్రెస్ మీట్‌లో శివాజీ వాడిన “సామాను, దరిద్రపు ము...” వంటి అసభ్యకర పదజాలంపై 'వాయిస్ ఆఫ్ ఉమెన్' తీవ్రంగా స్పందించింది. ఇవి కేవలం మాటలు కావని, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 79 (గతంలో IPC 509) ప్రకారం మహిళల గౌరవానికి భంగం కలిగించే నేరాలని వారు గుర్తు చేశారు. "నీతులు చెప్పే సాకుతో ఇలా మాట్లాడటం ఏ రకమైన సంస్కృతి?" అని వారు ప్రశ్నించారు.
పరిశ్రమ మౌనంపై నిలదీత..
మహిళల భద్రత విషయంలో చిత్ర పరిశ్రమ వ్యవహరిస్తున్న 'సెలెక్టివ్ సైలెన్స్' మమ్మల్ని కలచివేస్తోంది. ఇటీవల నటీమణులు నిధి అగర్వాల్, సమంతలను జనం చుట్టుముట్టి ఇబ్బంది పెట్టినప్పుడు (Mobbing) పరిశ్రమ నుంచి ఎలాంటి సామూహిక స్పందన రాలేదు. మహిళల భద్రత ప్రమాదంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి, వారి దుస్తుల విషయంలో మాత్రం ఇంత గట్టిగా నీతులు చెప్పడం ఏ రకమైన ధోరణి? 'వాయిస్ ఆఫ్ ఉమెన్' అని ఈ లేఖలో ప్రశ్నించింది.
'మా' ముందుంచిన డిమాండ్లు
శివాజీ బేషరతు క్షమాపణ చెప్పడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కొన్ని కీలక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మేము చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రవర్తనా నియమావళి (Code of Conduct) కింద మహిళా వ్యతిరేక, లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసే సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రమోషన్లు, పబ్లిక్ ఈవెంట్లలో మహిళా ఆర్టిస్టులకు పటిష్టమైన భద్రత కల్పించాలి. నటీనటులకు జెండర్ సెన్సిటైజేషన్ తరగతులు నిర్వహించాలి. మహిళల స్వేచ్ఛ, గౌరవం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని అసోసియేషన్ తరపున ఒక అధికారిక ప్రకటన విడుదల చేయాలని వారు లేఖ ద్వారా డిమాండ్ చేశారు.
చట్టపరమైన చర్యలకు సిద్ధం!
"మహిళలకు స్వేచ్ఛ, భద్రత, గౌరవం కావాలి.. నీతులు, కపటత్వం, మౌనం కాదు" అంటూ ఈ బృందం స్పష్టం చేసింది. శివాజీ వెంటనే క్షమాపణ చెప్పకపోతే తాము చట్టపరమైన మార్గంలో వెళ్తామని వారు హెచ్చరించారు. ఇప్పటికే చిన్మయి, అనసూయ, మంచు మనోజ్, ఆర్జీవీ వంటి వారు శివాజీ వ్యాఖ్యలను తప్పుబట్టగా, ఇప్పుడు ఏకంగా మహిళా ప్రముఖులు ఏకమవ్వడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. మరి ఈ వివాదంపై 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి..
