యూరియా యాప్‌‌‌‌తో..రైతులకు తిప్పలు తప్పినయ్‌‌‌‌

యూరియా యాప్‌‌‌‌తో..రైతులకు తిప్పలు తప్పినయ్‌‌‌‌
  • లైన్లు, ఆందోళనలు లేకుండానే రైతులకు అందుతున్న యూరియా బస్తాలు
  • అవసరమైనప్పుడు బుక్‌‌‌‌ చేసుకొని తీసుకెళ్తున్న రైతులు
  • ఈ సీజన్‌‌‌‌లో రాష్ట్రవ్యాప్తంగా 9,81,858 టన్నుల యూరియా పంపిణీ
  • గతేడాదితో పోలిస్తే అదనంగా 50 వేల టన్నులు అమ్మకం

కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో గత వానాకాలం సీజన్‌‌‌‌తో పోలిస్తే రైతులకు ప్రస్తుత యాసంగి సీజన్‌‌‌‌లో యూరియా తిప్పలు తప్పాయి. రైతులు యూరియాను కొనుగోలు చేసుకునేందుకు ప్రభుత్వం కొత్తగా యాప్‌‌‌‌ను ప్రవేశపెట్టింది.

దీంతో రైతులు తమకు కావాల్సిన యూరియాను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో బుక్‌‌‌‌ చేసుకుని.. తమకు కేటాయించిన రోజు డైరెక్ట్‌‌‌‌గా సమీపంలోని స్టాక్‌‌‌‌ పాయింట్‌‌‌‌కు వెళ్లి యూరియా బస్తాలను తెచ్చుకుంటున్నారు. పీఏసీఎస్‌‌‌‌లు, మార్క్‌‌‌‌ఫెడ్‌‌‌‌ గోదాములు, ప్రైవేట్‌‌‌‌ డీలర్ల వద్ద ఎక్కడికక్కడ యూరియా స్టాక్‌‌‌‌ పెట్టడంతో రైతులకు గంటల తరబడి క్యూలో నిల్చోవడం, స్టాక్‌‌‌‌ కోసం ఎదురుచూడడం వంటి అవస్థలు తప్పాయి.

తమ వంతు వచ్చేసరికి యూరియా దొరుకుతుందో లేదోనన్న భయంతో రైతులంతా గతంలో లాగా ఒకేసారి లైన్‌‌‌‌ కట్టకుండా.. తమకు అవసరమైనప్పుడే యూరియా బుక్ చేసుకుని తీసుకెళ్తున్నారు. నిరుడు యాసంగిలో రాష్ట్రవ్యాప్తంగా 9,33,985 టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేయగా.. ఈ యాసంగి సీజన్‌‌‌‌లో ఇప్పటివరకు 9,81,858 టన్నుల యూరియాను రైతులు కొనుగోలు చేశారు.

గతేడాదితో పోలిస్తే ఈ సారి సుమారు 50 వేల టన్నుల యూరియా అమ్మకాలు అదనంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది పోను రాష్ట్రంలో అన్ని స్టాక్‌‌‌‌ సెంటర్లలో కలిపి 60,040 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు కరీంనగర్‌‌‌‌ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి వెల్లడించారు.   

యాప్‌‌‌‌తో తప్పిన ఇబ్బందులు

ప్రభుత్వం తీసుకొచ్చిన మొబైల్ యాప్‌‌‌‌పై రైతులకు పెద్దగా అవగాహన లేక ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తప్పలేదు. ఈ క్రమంలో తమ పిల్లలతోనో లేదా తెలిసినవాళ్ల సాయంతోనే యాప్‌‌‌‌ను డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకొని పాస్‌‌‌‌బుక్‌‌‌‌ లింక్‌‌‌‌ చేసిన మొబైల్‌‌‌‌ నంబర్‌‌‌‌ ద్వారా లాగిన్‌‌‌‌ అవడంతో పాటు భూమి వివరాలు ఎంట్రీ చేసి యూరియా బుక్‌‌‌‌ చేసుకుంటున్నారు.

కౌలు రైతులయితే అందులోని సిటిజన్‌‌‌‌ అకౌంట్‌‌‌‌ నుంచి బుక్‌‌‌‌ చేసుకోవాల్సి వస్తోంది. అయితే వారికి పాస్‌‌‌‌బుక్‌‌‌‌ ఉండాల్సిన అవసరం లేదు. తాము కౌలుకు చేస్తున్న భూమి వివరాలు ఎంట్రీ చేస్తే ఆ భూమి ఓనర్‌‌‌‌ సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌కు ఓటీపీ వెళ్తుంది. ఓనర్‌‌‌‌ను ఓటీపీ అడిగి యూరియా బుక్‌‌‌‌ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో నుంచే యూరియా బస్తాలు బుక్ చేసుకున్నాక.. ఆ బుకింగ్ ఐడీ ద్వారా మండలంలోని ఏ స్టాక్‌‌‌‌ పాయింట్‌‌‌‌కైనా వెళ్లి యూరియా తీసుకునే వెసులుబాటు ఉంది. దీంతో గత సీజన్‌‌‌‌లో కనిపించినట్లుగా యూరియా సెంటర్ల వద్ద లైన్లు కనిపించడం లేదు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కిన ఘటనలు కూడా గణనీయంగా తగ్గిపోయాయి.    

నిజామాబాద్‌‌‌‌లో అత్యధికంగా అమ్మకాలు

రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో ఈ యాసంగి సీజన్‌‌‌‌లో గతేడాదితో పోలిస్తే ఎక్కువ యూరియా అమ్ముడయింది. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 76,420 టన్నుల యూరియా అమ్ముడుపోగా.. నల్గొండ జిల్లాలో 75,216 టన్నులు, సూర్యాపేట జిల్లాలో 73,961 టన్నులు, ఖమ్మం జిల్లాలో 66,061 టన్నులు, మహబూబాబాద్ జిల్లాలో 49,122 టన్నులు,  కరీంనగర్ జిల్లాలో 41,856 మెట్రిక్ టన్నుల యూరియా అమ్ముడుపోయింది.

ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లాలో గతేడాది యాసంగిలో 5,139 టన్నుల యూరియా మాత్రమే అమ్ముడుపోగా.. ఈ ఏడాది 7,792 మెట్రిక్ టన్నుల యూరియా అమ్ముడైంది. ఈ జిల్లాలో అదనంగా ఈ సీజన్‌‌‌‌ 2,653 టన్నుల (52 శాతం) యూరియాను కొనుగోలు చేయడం గమనార్హం. అలాగే యాదాద్రి భువనగిరిలోనూ నిరుడు 22,517 టన్నులు కొనగా.. ఈ సారి 29,427 టన్నులు కొన్నారు. అదనంగా 6,910 టన్నుల (31 శాతం) యూరియాను రైతులు కొనుగోలు చేశారు. 

యాప్‌‌‌‌తో లైన్లు కట్టే బాధ తప్పింది 

ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన యూరియా యాప్‌‌‌‌తో మొదట్లో కంగారుపడ్డాం. యురియా బుక్‌‌‌‌ చేసుకునుడు ఎలాగని భయపడ్డం. కానీ ఫోన్‌‌‌‌లో యాప్‌‌‌‌ డౌన్‌‌‌‌లోడ్‌‌‌‌ చేసుకొని చాలా సులువుగా యూరియా బుకింగ్‌‌‌‌ చేసుకుంటున్నాం. యాప్‌‌‌‌తో గంటల తరబడి లైన్‌‌‌‌లో నిలబడే అవస్థ తప్పింది. నాకు ఐదు ఎకరాల భూమి ఉండగా మొదటి విడత ఎనిమిది యూరియా బస్తాలు యాప్ ద్వారా తీసుకున్నా. యాప్‌‌‌‌తో యూరియా పక్కదారి పట్టకుండా ఉంటుంది. ఎవరి పేరుతో ఎన్ని బస్తాలు తీసుకున్నారో కూడా తెలిసిపోతుంది.

- గాదె రాజు, చీమలకుంటపల్లి, గన్నేరువరం–