రంగారెడ్డి జిల్లాలో భూమి ఉంటే కోటీశ్వరులేనన్న సీఎం.. కొత్వాల్ గూడలో ఎకో పార్క్ ప్రారంభం

రంగారెడ్డి జిల్లాలో భూమి ఉంటే కోటీశ్వరులేనన్న సీఎం.. కొత్వాల్ గూడలో ఎకో పార్క్ ప్రారంభం

రంగారెడ్డి: కొత్వాల్ గూడలో HMDA నిర్మించిన ఎకో పార్క్ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం (మార్చి 6, 2026) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎకో పార్క్ ను చూస్తే మనకు ఆకలేయదని చెప్పారు. ఎకో పార్క్ను HMDA అంత అద్భుతంగా తీర్చిదిద్దిందని సీఎం కొనియాడారు. హైదరాబాద్, రంగారెడ్డి కంటే బెస్ట్ నగరాలు మరొకటి లేవని తెలిపారు. మంచి ప్రభుత్వాలు ఉంటే ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేయొచ్చని సీఎం చెప్పారు. హైదరాబాద్కు వచ్చే పర్యాటకులు ఇకపై ఎకో పార్క్కు వస్తారని సీఎం ఆకాంక్షించారు. రంగారెడ్డి జిల్లాలో భూమి ఉంటే కోటీశ్వరులని సీఎం రేవంత్ చెప్పారు. 

హైదరాబాద్లో ఎన్నో అద్భుత కట్టడాలు ఉన్నాయని, కబ్జాలతో నగరాన్ని నాశనం చేశారని సీఎం గత పాలకులపై మండిపడ్డారు. హైదరాబాద్ ఇప్పుడు చెత్తతో నిండిపోయిన నగరం అంటున్నారని, నగరాన్ని బాగు చేద్దామంటే కొంత మంది అడ్డుపడుతున్నారని సీఎం ఆరోపించారు. మూసీ పక్కన బతకాలని ఏ కుటుంబం కోరుకోదని రేవంత్ రెడ్డి చెప్పారు. ఐదేండ్లలో శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తదని, బుల్లెట్ ట్రైన్ ఎక్కితే రెండున్నర గంటల్లోనే ముంబై పోవచ్చని సీఎం వివరించారు. ప్రపంచంలో గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నామని, అమెరికాకు చెందిన పెద్ద పెద్ద సంస్థలతో మాట్లాడుతున్నామని స్థానికులకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

ఎకో పార్కు ప్రత్యేకతలు ఇవే:
* హిమాయత్ సాగర్ సమీపంలో 85 ఎకరాల్లో ఎకో పార్కును అభివృద్ధి చేసిన హెచ్ఎండీఏ
* రూ. 75 కోట్లతో ఎకో పార్కును నిర్మించిన హెచ్ఎండీఏ
* ఎకో పార్కులో ప్రత్యేక ఆకర్షణగా దక్కన్ బర్డ్ సఫారీ పార్క్
* ఐదు ఎకరాల్లో 6 వేల 500 వివిధ రకాల పక్షులతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బర్డ్ పార్క్
* బర్డ్ పార్క్లో 4 ఖండాల నుంచి 40 రకాల విదేశీ పక్షులు
* ఎకో పార్క్లో 1.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ వాక్ వే
* మార్చి 7, 2026 (శనివారం) నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న ఎకో పార్క్