హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వైన్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం వర్జీనియాలోని లీస్‌బర్గ్‌లో ఉన్న ప్రసిద్ధ స్టోన్ టవర్ వైనరీతో పాటు అష్‌బర్న్‌లోని మరొక వైనరీని పరిశీలించారు. వైన్ తయారీ విధానం, నిర్వహణ తీరును తెలుసుకున్నారు. ద్రాక్ష సాగుకు అనుకూలమైన రకాలు, ప్రొసెసింగ్, ఫెర్మెంటేషన్ (కిణ్వ ప్రక్రియ), నిల్వ ఉంచే పద్ధతులు, బాట్లింగ్, నాణ్యతా ప్రమాణాలు, మార్కెటింగ్‌పై ఆరా తీశారు.
వైన్ టూరిజం ద్వారా సందర్శకులకు కొత్త అనుభూతిని అందించడమే కాకుండా, ద్రాక్ష సాగుచేసే రైతులకు మద్దతుగా నిలవవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల నిర్వహించిన తెలంగాణ టూరిజం కాన్‌క్లేవ్ లో రూ.15 వేల కోట్లకుపైగా పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని, అందులో 'వైనరీ వాక్‌థ్రూ' అనుభూతితో కూడిన ‘వైన్‌యార్డ్ రిసార్ట్’ ఏర్పాటు ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఉన్నారు.
