రోబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ అరుదైన ఘనత.. మూడేళ్ళలోపే వెయ్యి సర్జరీలు.. 90శాతానికి పైగా ఉచితం...

రోబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ అరుదైన ఘనత.. మూడేళ్ళలోపే వెయ్యి సర్జరీలు.. 90శాతానికి పైగా ఉచితం...

హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి రోబోటిక్ సర్జరీ రంగంలో మైలురాణిం అధిగమించింది. రోబోటిక్ సర్జరీ సేవలను ప్రారంభించిన మూడేళ్లలోపే వెయ్యి విజయవంతమైన రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసి పబ్లిక్ హెల్త్ సెక్టార్ లో విశిష్ట గుర్తింపు సాదించింది. విజయవంతమైన సర్జరీల్లో 90 శాతానికి పైగా ఉచితం కావడం విశేషం.

అత్యాధునిక సాంకేతికతతో కూడిన రోబోటిక్ సర్జరీలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన నిమ్స్, నాణ్యమైన వైద్యసేవలను అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు అధికారులు.ఈ వెయ్యి శస్త్రచికిత్సల్లో యూరాలజీ విభాగం 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం 248, సర్జికల్ ఆంకాలజీ విభాగం 162 ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు అధికారులు. వీటిలో ప్రోస్టేట్, మూత్రాశయం, కిడ్నీ, కాలేయం, ప్యాంక్రియాస్, పేగులు, అండాశయం, గర్భాశయం తదితర క్లిష్టమైన క్యాన్సర్, ఇతర ప్రధాన శస్త్రచికిత్సలు ఉన్నాయని అన్నారు.

ముఖ్యంగా, ఈ వెయ్యి రోబోటిక్ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ మరియు సీఎం రిలీఫ్ ఫండ్ పథకాల ద్వారా రోగులకు పూర్తిగా ఉచితంగా నిర్వహించడం నిమ్స్ సాధించిన మరో విశేష ఘనత అని తెలిపారు.

ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్ మాట్లాడుతూ, ఈ అరుదైన విజయానికి కృషి చేసిన యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ విభాగాల వైద్యులు, అనస్థీషియా నిపుణులు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందం, ఇతర సహాయక విభాగాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరింత మంది పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్యసేవలను అందించేందుకు నిమ్స్ కట్టుబడి ఉంటుందని తెలిపారు.