VijayRashmika: ఉదయ్‌పూర్‌లో 'విరోష్ ప్రీమియర్ లీగ్'.. సరదాగా సాగుతున్న విజయ్-రష్మికల పెళ్లి!

VijayRashmika: ఉదయ్‌పూర్‌లో 'విరోష్ ప్రీమియర్ లీగ్'..  సరదాగా సాగుతున్న విజయ్-రష్మికల పెళ్లి!

టాలీవుడ్ ప్రేమ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మరి కొన్ని గంటల్లో ( ఫిబ్రవరి 26న ) పెళ్లి పీటలెక్కబోతున్నారు. రాజస్థాన్‌లోని చారిత్రాత్మక నగరం ఉదయ్‌పూర్‌ ప్యాలెస్ లో వీరి వివాహం అత్యంత వైభవంగా, పరిమిత సంఖ్యలో అతిథుల సమక్షంలో జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సంబరాలు ప్రారంభమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఈ జంట తమ ఇన్ స్ట్రాగ్రామ్ లో పంచుకున్నారు. 

'విరోష్ ప్రీమియర్ లీగ్'తో మొదలైన సందడి

సాధారణంగా సెలబ్రిటీల పెళ్లిళ్లంటే హంగూ ఆర్భాటాలు కనిపిస్తాయి, కానీ విజయ్-రష్మికలు మాత్రం తమ పెళ్లిని చాలా సరదాగా, ప్రైవేట్‌గా ప్లాన్ చేసుకున్నారు. మంగళవారం (ఫిబ్రవరి 24) నాడు వీరు పంచుకున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘Virosh Premier League’ (VPL) పేరుతో నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. రష్మిక షేర్ చేసిన ఫోటోలో క్రికెట్ గ్రౌండ్ మార్కింగ్ కనిపిస్తుండగా, విజయ్ అదే పేరుతో ఉన్న 'పాప్‌కార్న్ బకెట్' ఫోటోను షేర్ చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆడిన 'పూల్ వాలీబాల్' మ్యాచ్ కూడా ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

అభిమానుల కోసం 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్'

తమ పెళ్లి గురించి ఈ జంట ఆదివారం (ఫిబ్రవరి 22) నాడు ఒక ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశారు. "మేము మా కోసం ఏదైనా పేరు అనుకోకముందే, మీరందరూ మమ్మల్ని ప్రేమగా 'విరోష్' అని పిలిచారు. అందుకే మీ ప్రేమకు గౌరవంగా మా వివాహానికి 'ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్' అని పేరు పెడుతున్నాం" అని పేర్కొన్నారు. ఇది విన్న అభిమానులు తమ ఫేవరెట్ జోడీ ఒక్కటవుతున్నందుకు ఆనందంతో మునిగిపోతున్నారు.

సినిమా సెట్ లో మొదలైన ప్రయాణం..

వీరిద్దరి ప్రయాణం 2018లో వచ్చిన 'గీత గోవిందం' సినిమాతో మొదలైంది. ఆ చిత్రంలో వీరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత 2019లో 'డియర్ కామ్రేడ్' చిత్రంతో వీరి బంధం మరింత బలపడింది. అప్పటి నుండి వీరిద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లడం, ఒకరి కుటుంబ వేడుకల్లో మరొకరు కనిపించడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. చివరకు గతేడాది అక్టోబర్ 3న హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.

రాయల్ డిన్నర్.. గోల్డెన్ థీమ్!

పెళ్లి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన డిన్నర్ సెటప్ ఫోటోలు చూస్తుంటే చాలా రిచ్‌గా కనిపిస్తున్నాయి. లేత గులాబీ రంగు లిల్లీలు, గ్రీన్ హైడ్రేంజా పూలతో అలంకరించిన డైనింగ్ టేబుల్, గోల్డెన్ లైటింగ్ మధ్య రష్మిక షేర్ చేసిన పిక్చర్ ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉంది. ఉదయ్‌పూర్‌లో ప్యాలెస్‌లో జరగనున్న ఈ పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్ నుండి కేవలం కొద్దిమంది ప్రముఖులు మాత్రమే హాజరవుతున్నారు. అటు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఫ్యామిలీతో హాజరుకానున్నారని తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో విజయ్-రష్మిక దంపతులు కాబోతున్నారన్న వార్త ఇప్పుడు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది..