Tamannaah Bhatia: డబ్బు సంపాదించడం కాదు.. నిలబెట్టుకోవడం ముఖ్యం: తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Tamannaah Bhatia: డబ్బు సంపాదించడం కాదు.. నిలబెట్టుకోవడం ముఖ్యం: తమన్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సినీ  గ్లామర్ ప్రపంచం అనేది అద్దాల మేడ లాంటిది. ఇక్కడ వెలుగులు ఎంత త్వరగా వస్తాయో.. చీకట్లు కూడా అంతే వేగంగా అలుముకుంటాయి. ఒక్కసారిగా వచ్చిన స్టార్ డ్రమ్.. ఎల్లప్పుడు నిలవదు. అందుకే సినిమా వాళ్లకు క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అనే మాట ఇండస్ట్రీలో తరచుగా వినిపిస్తుంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్మి, తన భవిష్యత్తును చక్కదిద్దుకుంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.

తండ్రి అండతో అడుగులు

కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది తమన్నా. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు గత 21 ఏళ్లుగా అగ్ర కథానాయికగా రాణిస్తోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ఆర్థిక విషయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ ఆరంభంలో ఆర్థిక వ్యవహారాలన్నీ తన తండ్రి చూసుకునేవారు. ఆ వయసులో ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వమే తనను ఈరోజు సురక్షితమైన స్థితిలో ఉంచిందని ఆమె చెప్పుకొచ్చింది.

సంపాదన కంటే పొదుపే ముఖ్యం!

సినీ ఇండస్ట్రీలో నటీనటుడు భారీగా సంపాదిస్తారన్నది నిజమే. కానీ, ఆ డబ్బును సరైన మార్గాల్లో పెట్టుబడి పెట్టకపోతే చివరకు చేతిలో ఏమీ మిగలదని తమన్నా హెచ్చరించింది. మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు, అందులో ఎంత పొదుపు చేస్తున్నాం, దాన్ని ఎలా రెట్టింపు చేస్తున్నాం అన్నదే ముఖ్యం అని ఆమె పేర్కొంది. ప్రస్తుతం తమన్న  తన సంపాదనను తెలివిగా వివిధ రంగాలపై పెట్టుబడులు పెడుతోంది. రియల్ ఎస్టేట్ తో పాటు జ్యువెలరీ బిజినెస్ లో కూడా అడుగు పెట్టింది. ఇటీవల సొంతంగా ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ ను  ప్రారంభించింది. అంతే కాకుండి వైవిధ్యమైన ఇతర పోర్ట్ ఫోలియోను మెయింటైన్ చేస్తున్నట్లు వెల్లడించింది.

►ALSO READ | Nani Odela: నన్ను నమ్మింది నువ్వే అన్నా.. జీవితమంతా రుణపడి ఉంటా: నానికి ఓదెల ఎమోషనల్‌ పోస్ట్

గత కాలపు చేదు జ్ఞాపకాలు

తమన్నా చెప్పిన మాటలు అక్షర సత్యాలు అనడానికి గతం జరిగిన సంఘటనలు కూడా గుర్తుచేస్తున్నాయి. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సైతం 1990లలో తన 'ABCL' సంస్థ వల్ల దివాలా తీశారు. కోట్లలో అప్పులు ఉన్న సమయంలో ఆయన మళ్లీ సున్నా నుండి మొదలుపెట్టి ఈరోజు దేశంలోనే అత్యంత సంపన్న నటుల్లో ఒకరిగా నిలిచారు. 1980వ దశకంలో స్టార్‌గా వెలిగిన జాకీ ష్రాఫ్, 2000 ప్రారంభంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని దివాలా స్థాయికి చేరుకున్నారు.  ఒకప్పుడు లగ్జరీ కార్లు, బంగళాల్లో నివసించిన  దిగ్గజ నటులు భగవాన్ దాదా, భారత్ భూషణ్ చివరి రోజుల్లో నిరుపేదలుగా గడపడం చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాన్ని చూపిస్తుంది.

ప్రస్తుతం తమన్నా కేవలం నటిగానే కాకుండా ఒక పక్కా బిజినెస్ ఉమెన్‌లా ఆలోచిస్తోంది. గ్లామర్ రంగంలో కెరీర్ ఎప్పుడైనా ముగియవచ్చు, కానీ తెలివైన పెట్టుబడులు జీవితాంతం తోడుంటాయి. ఆమె ప్రయాణం కేవలం నటులకే కాదు, సామాన్యులకు కూడా ఒక ఆర్థిక పాఠంగా నిలుస్తోంది...