ఉపాధిలో అక్రమాలపై ఉక్కుపాదం!..దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం

ఉపాధిలో అక్రమాలపై ఉక్కుపాదం!..దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
  • మరో 314 మందిపై సస్పెన్షన్ వేటు
  •     20 వేల మందికి జరిమానా.. రూ.5.96 కోట్లు రికవరీ 
  •     అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్యల్లో మన రాష్ట్రమే ఫస్ట్​
  •     పదేండ్ల సోషల్​ఆడిట్ వివరాలు వెల్లడించిన కేంద్రం  

హైదరాబాద్, వెలుగు: ఉపాధి హామీ స్కీమ్​లో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై వేటు వేయడంలో  దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ స్కీమ్ అమలులో జరిగిన అవకతవకలను గుర్తించడంతోపాటు  బాధ్యులైన సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించడం, డబ్బులు రికవరీ చేయడంలో రాష్ట్రం రికార్డు సృష్టించింది. ఈ మేరకు పదేండ్ల సోషల్ ఆడిట్ (సామాజిక తనిఖీ) వివరాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల అధికారికంగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉపాధి హామీలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ వాటిని కఠిన చర్యలు తీసుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందువరుసలో నిలిచింది. 

అక్రమాలు జరిగాయిలా.. 

క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ స్కీమ్​లో  నిధులు ఎలా దారి మళ్లాయనే దానిపై సోషల్ ఆడిట్​లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా ఫీల్డ్​, టెక్నికల్ అసిస్టెంట్లు, కొందరు అధికారులు కుమ్మకై అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. నిబంధనల ప్రకారం ఉపాధి పనులు కూలీలతోనే చేయించాలి. కానీ, జేసీబీలు, ట్రాక్టర్లతో పనులు చేయించి మస్టర్ రోల్స్ (హాజరు పట్టిక)లో మాత్రం కూలీలు పనిచేసినట్టు రాసుకున్నారు. ఊర్లో లేనివారు, చనిపోయిన వారి పేర్లను జాబ్​కార్డుల నుంచి తొలగించకుండా వారి పేర్లపై డబ్బులు డ్రా చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. కందకాలు తవ్వడం, మట్టి పోయడం వంటి పనుల్లోనూ తక్కువ పనిచేసి ఎక్కువ కొలతలు నమోదు చేయడం ద్వారా అదనపు బిల్లులు పొందినట్టు ఆడిట్​లో తేలింది. గతంలో ఎప్పుడో చేసిన పనులను మళ్లీ ఇప్పుడు కొత్తగా చేసినట్టు రికార్డులు సృష్టించి నిధులు స్వాహా చేశారని తెలిసింది. 

రికవరీపై స్పెషల్ ఫోకస్

కేవలం సిబ్బందిని తొలగించడంతో సరిపెట్టకుండా ప్రజాధనాన్ని రికవరీ చేయడంపై రాష్ట్ర యంత్రాంగం ప్రత్యేక దృష్టిసారించింది. సోషల్ ఆడిట్ బృందాలు గ్రామాల వారీగా నిర్వహించిన ప్రజావేదికల్లో ఈ అక్రమాలను సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టడంతో చర్యలకు ఉపక్రమించారు. రాబోయే రోజుల్లో సోషల్ ఆడిట్ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని, అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు.

అక్రమాలు చేసిసోళ్లపై వేటు..

రాష్ట్రంలో పదేండ్ల కాలంలో ఉపాధి హామీలో భారీగా అక్రమాలు వెలుగు చూసినట్టు సోషల్ ఆడిట్ లో తేలింది. దీంతో, అక్రమాలకు పాల్పడినవారందరిపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అవినీతికి పాల్పడినట్టు రుజువైన 346 మంది సిబ్బందిని ఇప్పటి వరకు సర్వీసు నుంచి తొలగించింది. మరో 314 మందిని సస్పెండ్​చేసింది. కేవలం తొలగించడమే కాకుండా అక్రమాలకు బాధ్యులైన సుమారు 20 వేల మందికి జరిమానాలు కూడా విధించింది. దుర్వినియోగమైన నిధుల నుంచి ఇప్పటి వరకు ఏకంగా రూ.5.96 కోట్లు రికవరీ చేసింది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో సిబ్బందిపై చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ చూపిన చొరవను కేంద్రం ప్రశంసించింది.